Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేసి పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వానా కాలం పంటలను మొదటి దశలోనే వర్షాలు దెబ్బతీశాయనీ, ఇప్పుడు చేతికొచ్చే సమయంలోనూ వర్షాలు నిరంతరంగా పడుతుండడంతో దాదాపు 13 జిల్లాల్లో భారీ నష్టం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సోయాబీన్, పత్తి, మొక్కజొన్న దిగుబడులపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. నిరంతర వర్షాల వల్ల 35 వేల ఎకరాల్లో తెగుళ్లు, చీడపీడలతో పత్తి, మిర్చి, వరి, సోయాబీన్, కంది, మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయని వివరించారు. జులై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం అప్పట్లో రూ.3,750 కోట్ల మేర పంటల నష్టం జరిగినట్టు అంచనా వేశారని గుర్తు చేశారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారా బాద్, నారాయణపేట, కొమురంంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు.
పంటల నష్టాన్ని అంచనా వేయడానికి సర్వే చేసి పరిహారం ఇవ్వాల్సిన పాలకులు వారికి ఏమీ పట్టనట్టుగా ఉండటం క్షమించరాని నేరమని విమర్శించారు. పంటల నష్టాలతో పెట్టుబడి కూడా తిరిగిరాని విషమ పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పంటల బీమా అమలు చేసే బాధ్యతల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైదొలగడం వల్లే పంట నష్టాలను అంచనా వేయ డానికి సర్వే నిర్వహించడం లేదని విమర్శించారు. రైతుపక్షం వహించి పంటనష్టాలపై సర్వే చేయించి, పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.