Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పోషకాహార లోపమున్న గర్భిణీ స్త్రీలకు త్వరలో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం, ఆశాల పనితీరుపై నెలవారీ సమీక్షలో భాగంగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలోని 729 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సీసీ కెమెరాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఆన్లైన్లోకి తేవాలని ఆదేశించారు. టీబీ రోగులకు సిద్ధిపేట, వనపర్తిలో మాదిరిగా నిక్షయ పోషకాహార కిట్లను అన్నిజిల్లాల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఎన్ఎసీ పరీక్షల నిర్వహణలో వికారాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, వనపర్తి, జగిత్యాల జిల్లాలు ఎందుకు వెనకబడ్డాయో వివరనివ్వాలని కోరారు.
ప్రయివేటుకు ఎందుకు వెళుతున్నారు? :అధికారులను ప్రశ్నించిన మంత్రి
నిజామాబాద్, సూర్యాపేట, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 45 శాతానికి పైగా ప్రసవాలు ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎందుకు జరుగుతున్నాయనే అంశంపై సమీక్ష నిర్వహించాలని ఉన్నతాధికారులను, ఆయా జిల్లాల వైద్య,ఆరోగ్య అధికారులను మంత్రి ఆదేశించారు. మెదక్, ములుగు జిల్లాల్లో 80 శాతం ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతుండగా, మిగిలిన జిల్లాల్లో అలా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే వంద శాతం డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సి సెక్షన్లు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలు హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల కారణాలు పరిశీలించి సహజ ప్రసవాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.