Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మునుగోడు'పై మంత్రి కేటీఆర్
- రాజగోపాల్‌రెడ్డి ఓ అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే అని ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మునుగోడు ఉప ఎన్నిక అనేది ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అహంకారానికి మధ్య జరగబోతున్న ఉప ఎన్నిక...' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అక్రమ కాంట్రాక్టుల ద్వారా వచ్చిన వేల కోట్ల ధనబలంతో ఇప్పటిదాకా జనాలను పట్టించుకోని ఆయన తన స్వార్థం కోసమే ఉప ఎన్నికను తీసుకొచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ తరపున మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు, కార్యాకర్తలతో సోమవారం కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజగోపాల్‌రెడ్డి గత నాలుగేండ్లలో ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని తెలిపారు. తద్వారా ఆయనో అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కష్ట సుఖాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆయన ఫక్తు రాజకీయ వ్యాపారిలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో జనం సమస్యల గురించి కాకుండా కేవలం కాంట్రాక్టర్ల బిల్లుల గురించే ఎక్కువగా మాట్లాడేవారని విమర్శించారు. ఇప్పుడు కూడా వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల కోసమే ఆయన బీజేపీలో చేరారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ హెచ్చరించారు.