Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్ కలెక్టరేట్ ఎదుట గిరిజనుల ధర్నా
నవతెలంగాణ-మెదక్ రూరల్
'దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేయాలి.. మా భూమిని మాకే అందించాలి' అని గిరిజనులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం, సంగ్యా తండా గిరిజనులు కుటుంబ సమేతంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బంజారా సేవాలాల్ సంఘ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ మాట్లాడుతూ.. టేక్మాల్ శివారులో కడీలబాయి రోడ్డు తండా, సంగ్యా తండాలో పదిమందికి సర్వేనెంబర్ 413లో అసైన్డ్ భూమి నాలుగు ఎకరాలు ఉందన్నారు. ఈ భూమిని అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఉప సర్పంచ్ కొంపోత్ సంతోష్ దౌర్జన్యంగా దున్నేశాడన్నారు. భూమి యజమానులైన పదిమందిపై పోలీసు కేసు పెట్టాడన్నారు. తండాకు చెందిన పోలీస్ పోచయ్య, రామయ్య, లంబాడి దుర్గయ్య, సాయి, లక్ష్మయ్య 1985లో 426 సర్వే నంబరులో రెండెకరాల భూమిని కొనుగోలు చేశారన్నారు. వీరంతా కాస్తులోనే ఉన్నా ధరణిలో పొరపాటున సంతోష్ పేరు రావడంతో ఈ భూమి తనదే అంటూ దౌర్జన్యానికి దిగి పోలీసు కేసు పెట్టించారన్నారు. కలెక్టర్ పంచనామా చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
భూములు పోతే బతికేదెట్టా?
భూములు పోతే బతికేదిట్టా అని బాధితులు వాపోయారు. భూమిని నమ్ముకుని బతికేటోళ్లం.. భూమి పోతే భార్యా పిల్లలను ఎట్టా పోషించుకుని బతికేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూమి మీదనే ఆధారపడి కలో గంజితో కడుపు నింపుకొని బతికేటోళ్లమని, భూమి ఉంటేనే మా పిల్ల లను చదివించుకుంటామని అన్నారు. భూమి పోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, కలెక్టర్ కనికరించి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు.