Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశమంటే గుజరాతే ఒక్కటేనా?
- ఆర్నెల్లలో ఆ రాష్ట్రానికే రూ.80 వేల కోట్లు : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ జీ... ఇదేం దుర్నీతి అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. గత ఆర్నెల్లలో గుజరాత్ రాష్ట్రానికే రూ.80 వేల కోట్ల సంపదను తరలించారని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కోఆపరేటివ్ ఫెడరలిజమంటే ఇదేనా?అని సూటిగా నిలదీశారు. భారతదేశమంటే ఒక్క గుజరాత్ మాత్రమేనన్న విధంగా ప్రధాని మోడీ వ్యహరిస్తున్నారనీ, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు వంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే డిసెంబర్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశ సంపదను ఆ రాష్ట్రానికే తరలించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసే విషయం గురించి ప్రధాని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలను పూర్తిగా విస్మరిస్తున్నదనీ, అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. కేవలం ఓట్లు, సీట్లు అన్న రాజకీయాలను కేంద్రం అమలు చేస్తున్నదనీ, అందుకే గుజరాత్‌కు నిధుల వరదను పారిస్తున్నదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు పొందే అవకాశం లేదనీ, అందుకే వాటిని పట్టించుకోవడం లేదని తెలిపారు. కేంద్రం సహకారం లేనప్పటికీ ప్రధాని మోడీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇవ్వకపోయినా తెలంగాణ అనేక రంగాల్లో స్వశక్తితో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి సాధిస్తున్నదని వివరించారు.