Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో తమ్మినేని వీరభద్రం ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. రాజకీయంగా ప్రధాన శత్రువైన మతోన్మాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో మతోన్మాద ఆగడాలు, దాడులను అరికట్టాలని, బీజేపీని బొంద పెట్టాలని అన్నారు. త్రిపుర, బెంగాల్ మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ దాడులు చేస్తూ అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీలో వలలో పడిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ఉపఎన్నికల్లో తరిమికొట్టాలని చెప్పారు. సొంత లాభాల కోసం కాకుండా ఎవరి కోసం రాజీనామా చేశావని ప్రశ్నించారు. సుమారు రూ. 22వేల కోట్లకు బీజేపీ మోకాళ్ల నీళ్లు తాగి ఈరోజు ఉపఎన్నికకు రావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఉన్న 22 రకాల ప్రజాసమస్యలను సీపీఐ(ఎం), సీపీఐ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం కోసం పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు దొంతగోని పెద్దలు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, ఉపసర్పంచ్ వర్కాల చంద్రశేఖర్, అయితరాజు గాలయ్య, దంతగోని అమరేందర్, పిట్ట రాములు, నడికుడి నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు సుక్క గాలయ్య, ఆడపు పరదేశి పాల్గొన్నారు.