Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్
- మహిళపై లైంగిదాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న నాగేశ్వరరావు
నవతెలంగాణ- కంటోన్మెంట్
మహిళపై లైంగికదాడి కేసులో జైలుకెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన మేడ్చల్ జిల్లా మారేడ్‌పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును పోలీసు శాఖ సర్వీస్ నుంచి తొలగించింది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వర్రావును వనస్థలిపురం పోలీసులు మూడు నెలల కిందట అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దృష్టికి వనస్థలిపురం పోలీసులు తీసుకెళ్లగా సీపీ వెంటనే నాగేశ్వర్రావును సస్పెండ్ చేశారు. ఆ తర్వాత నాగేశ్వర్రావు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రెండుసార్లు ఎల్బీనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 28న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే, ఈ కేసును సీపీ సీవీ ఆనంద్ సీరియస్‌గా పరిగణించారు. బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే.. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు నాగేశ్వర్ రావును విధుల నుంచి తొలగిం చాలని నిర్ణయం తీసుకు న్నారు. ఈ మేరకు సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
10 నెలల కాలం.. 55 మందిపై చర్యలు
సీపీ సీవీ ఆనంద్ గత సంవత్సరం డిసెంబర్ 25న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 55 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన లాలాగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కట్నం కోసం భార్యను వేధించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్‌ను, వీరితోపాటు మరో 53 మందిని సర్వీస్ నుంచి ఇది వరకే తొలగించారు. నాగేశ్వర్రావును డిస్మిస్ చేసిన సందర్భంగా ఈ 10 నెలల కాలంలో మిగతా వాళ్లపై తీసుకున్న చర్యల గురించి కూడా సీపీ కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది.
ఏం జరిగిందంటే..
మారేడ్‌పల్లి మాజీ సీఐ నాగేశ్వర రావుకు హైదరాబాద్ శివారులో వ్యవసాయ పొలం ఉంది. నాగేశ్వరరావు అఘాయిత్యం చేసినట్టు ఆరోపణలు చేసిన బాధిత మహిళ భర్తను నాలుగేండ్ల కిందట ఒక కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అతడి విషయంలో విచారణ చేపట్టాడు. ఆ తర్వాత అతను బెయిల్‌పై బయటకు వచ్చాక తన వ్యవసాయ పొలంలో పని చేసేందుకు నియమించుకున్నాడు. బాధిత దంపతులు వేరేచోట నివసించేవారు. అయితే, నాగేశ్వరరావు ఒకరోజు బాధిత మహిళను ఫామ్‌హౌస్‌కు వెళ్దామని పిలిచాడు. కంగారుపడిన సదరు మహిళ భర్తకు చెప్పగా.. వెంటనే అతడు నాగేశ్వరరావుకు ఫోన్ చేశాడు. తన భార్యను ఎందుకు ఒంటరిగా పిలిచారని నిలదీయడంతోపాటు ఇదంతా 'మీ భార్యకు చెబుతా'నని సీఐను హెచ్చరించాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు నాగేశ్వరరావు మహిళ భర్తకు ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టాడు. సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి రప్పించి, అతడి జేబుల్లో, చేతుల్లో గంజాయి సంచులు ఉంచి వీడియోలు, ఫొటోలు తీయించాడు. తాను చెప్పినట్టు వినకుంటే కేసులో ఇరికిస్తానని హెచ్చరించాడు. గతేడాది ఫిబ్రవరి వరకు ఫామ్‌హౌస్‌లో పనిచేసిన అతడు.. తర్వాత మానేశాడు. వనస్థలిపురంలో భార్యాపిల్లలతో కిరాయి ఇంట్లో నివసిస్తున్నాడు. నాగేశ్వరరావు వారి కదలికలపై నిఘా ఉంచాడు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు జులై 6న బాధితురాలికి వాట్సప్ కాల్ చేశాడు. 'నీ మొగుడు ఊళ్లో లేడుగా.. నేను వస్తున్నా' అన్నాడు. భయంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ సమయంలో సొంతూరులో ఉన్న ఆమె భర్త వెంటనే బయలుదేరాడు. కానీ, అదే రోజు రాత్రి నాగేశ్వరరావు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. రివాల్వర్ కణతకు గురిపెట్టి లైంగికదాడి చేశాడు. ఈలోపు బాధితురాలి భర్త వచ్చాడు. దాంతో నాగేశ్వరరావు రివాల్వర్ గురిపెట్టి భార్యాభర్తలను చంపేస్తానని బెదిరించాడు. ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకుని తన ఫామ్‌హౌస్ వైపు తీసుకెళ్తుండగా ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై టైరు పేలింది. దీంతో దంపతులిద్దరూ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. విచారణ అనంతరం పోలీసు శాఖ నాగేశ్వరరావును డిస్మిస్ చేసింది.