Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే
- నినాదాలతో మార్మోగిన కలెక్టరేట్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులంతా ఇండ్లు, ఇండ్లస్థలాలివ్వాలంటూ గళం విప్పారు. సుప్రీం కోర్టు తీర్పు అమలుచేయాలంటూ వందలాదిగా సోమవారం ''డిమాండ్స్ డే'' పాటించారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు కదం తొక్కుతూ ధర్నాకు దిగారు. ప్రదర్శనలుసైతం నిర్వహించారు. నినాదాలతో కలెక్టరేట్లు మార్మోగాయి. సమస్యలతోకూడిన ప్లకార్డులు, ప్లెక్సీలు ప్రదర్శించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండ్లస్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటలపాటు డిమాండ్స్ డే జరిగింది. ఇందులో భాగంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు, హెచ్‌యూజే నాయకులు, ఇతర జర్నలిస్టులు హైదరాబాద్ కలెక్టరేట్‌తోపాటు మాసాబ్‌ట్యాంక్‌లో గల రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ (సమాచార భవన్) ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందనీ, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాకు హెచ్‌యూజే అధ్యక్షులు ఈ.చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, కార్యదర్శి ఎస్కె.సలీమా, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాండు, బి. జగదీష్, రామారావు, హెచ్‌యూజే కార్యదర్శి కె. నిరంజన్, నేతలు జి.రఘు, బి రాజశేఖర్,పి.యాదగిరి, నాగవాణి, రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా కొత్తగూడెం-భద్రాద్రి జిల్లాలో ప్రదర్శన నిర్వమించారు. మేడ్చల్-మల్కాజ్గిరి , యాదాద్రి-భువనగిరి, నిర్మల్, జోగులాంబ గద్వాల, జగిత్యాల, వనపర్లి, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, హన్మకొండ, ములుగు, జనగామ, మంచిర్యాల, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, పెద్దపల్లి, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోనూ భారీసంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జర్నలిస్టుల ధర్నాకు మద్ధతు ప్రకటించారు. మహబూబ్‌నగర్, సంగారెడ్డి , ఖమ్మం, అదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ , మెదక్ జిల్లాల్లో డిమాండ్స్ డే నిర్వహించారు.