Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులకంటే ఎక్కువ వడ్డీ ఇస్తాం
- ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాల్లో చేరండి
- సేవల విస్తరణకై కేంద్రానికి ప్రతిపాదనలు
- ఆరు జిల్లాల్లో పోస్టాఫీసుల ద్వారా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు : తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కే ప్రకాశ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్న సేవల్ని ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కే ప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. మారుమూల గ్రామాలు మొదలు పట్టణాలు, మెట్రోనగరాల వరకు పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నాయనీ, వీటిని మరింత విస్తరించేలా కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి పోస్టల్ ఆర్థిక సాధికారిత దినోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దానిలో భాగంగా సోమవారం ఆబిడ్స్‌లోని పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ పీ విద్యాసాగర్‌రెడ్డి, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ టీఎమ్ శ్రీలత మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టు వరకు వివిధ పథకాల అమల్లో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. దసరా పండుగ సందర్భంగా అమెజాన్ వంటి సంస్థల నుంచి 30వేలకు పైగా ఆర్డర్లను డెలివరీ చేశామని చెప్పారు. పోస్టల్ శాఖ సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్లు, నెలవారీ ఆదాయ పథకాలు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకాలు, టైం డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి ఖాతాలు, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి వివిధ రకాల సేవల్ని ప్రజలకు అందిస్తున్నదని తెలిపారు. పోస్టల్ ఇన్సూరెన్స్, ఇతర ఖాతాల ద్వారా ప్రజలకు ఎలాంటి ఆర్థికపరమైన రిస్క్ లేకుండా కచ్చితమైన ఆదాయాన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తుందనీ, తక్కువ మొత్తాలతో పొదుపు చేసుకోవచ్చనీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,208 పోస్టు ఆఫీసుల్లో బ్యాంకింగ్, మోబైల్ బ్యాంకింగ్, ఏటీఎమ్ సెంటర్లు, ఆన్లైన్ నగదు బదిలీలు జరుగుతున్నాయని తెలిపారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రజలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిక్సెడ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పథకాలు సహా అన్నింటిలో జాతీయ బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే పోస్టల్ శాఖ ఇచ్చే వడ్డీ శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక పోస్ట్ ఆఫీస్ చొప్పున గ్రామీణంలో కొత్తగా మరో 56 పోస్ట్ ఆఫీసుల ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు. 24/7 అందుబాటులో ఉండే పోస్ట్ ఆఫీసులను కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే నగరంలోని హుమయూన్‌నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. పార్సిళ్లు, ఉత్తరాల బట్వాడాలో తమకు టీఎస్ఆర్టీసీ నుంచి ఎలాంటి పోటీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వారి సేవల్ని పెంచుకోవడానికి తమనే సంప్రదిస్తున్నారని వివరించారు. ఆర్టీసీ పార్సిల్స్ డోర్ డెలివరీలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయనీ, వాటిని పరిష్కరించుకొని మళ్ళీ ప్రారంభించే ప్రయత్నం చేస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలోని పది దేవస్థానాల్లో 82 రకాల సేవల బుకింగ్స్, ప్రసాద వితరణ వంటివి చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 20 లక్షల మందికి రూ.469 కోట్ల ఆసరా పెన్షన్లను పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నామనీ, పనికి ఆహార పథకంలో 48 లక్షల మందికి ఆర్థిక సేవల్ని అందిస్తున్నామనీ వివరించారు. కొత్తగా తెలంగాణ సర్కిల్లో 1,706 మందిని రిక్రూట్ చేసుకున్నామనీ, 464 మందికి ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. ఆదిలాబాద్, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో యువకులకు అవసరమైన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల సేవలను పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో పోస్టల్ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.