Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రౌండ్‌టేబుల్‌లో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విద్యావిధానం ధ్వంసమైపోయిందనీ, యువతకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'తెలంగాణలో ప్రయివేటు రంగం- ఉద్యోగాలలో 75 శాతం స్థానిక కోటా చట్టం' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రమొస్తే ప్రజలు బాగుపడుతా రనుకుంటే నిరాశే మిగిలిందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, రూ.5 భోజనం తింటూ చెట్ల కింద ఉండి చదువుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. ఉన్నత చదువులు చదివి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్న తీరును వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ప్రయివేటులో రిజర్వేషన్లు అడుగున్నామన్నారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..అందరికీ ఉద్యోగాలివ్వ లేమని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో కొంత వాస్తవమున్నప్పటికీ ఉపాధి చూపాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మరవొద్దని సూచించారు. ఉపాధి కల్పించని ప్రభుత్వాలెందుకు? అనే ప్రశ్న ప్రజల్లో ఉద్భవించడం సరైనదేనన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యువతను తాగుడికి బానిసల్ని చేస్తున్నదని విమర్శించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై భవిష్యత్‌లో పోరాటాలు చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలపై బైండోవర్ కేసులు పెట్టిస్తున్నదనీ, సమ్మెలు చేస్తే కార్మికుల్ని అణచి వేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన సంస్థల్లో స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు ఉన్నాయో శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన ప్రవేటు రంగం సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతామని చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ..రింగ్ రోడ్ పేరుమీద, రియల్ ఎస్టేట్ వ్యాపారలకు భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ...75 శాతం స్థానిక కోటా చట్టం తీసుకురావాలనీ, ప్రయివేటు రంగంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? స్థానికులు ఎంత మంది ఉన్నారు? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలనే తీర్మానాలను ప్రతిపాదించగా..సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో ప్రయివేటు ఉద్యో గ సంఘాల నేత నగేశ్, యూత్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.