Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో అధికారులు, వ్యాపారుల మధ్య వాగ్వాదం
- వైరా రోడ్డు చేపల మార్కెట్ షాపులు ఖాళీ
- వ్యాపారుల తరఫు న్యాయవాదులు, అధికారులకు వాదన
- కోర్టు గడువు ముగిసిన నేపథ్యంలో హడావుడిగా స్వాధీనం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / కార్పొరేషన్
కారణాలేవైనా.. ఖమ్మం నగరంలో దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న ఒక్కో మార్కెట్‌ను ఖమ్మం కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా సోమవారం వైరారోడ్డులోని పాత ఎల్ఐసీ ఆఫీస్‌కు సమీపంలో చేపలు, మాంసం మార్కెట్‌కు ఆనుకుని ఉన్న దుకాణాల సముదాయాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు, దుకాణాల నిర్వాహకుల మధ్య వాగ్వాదం జరిగింది. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో షాపులు కూల్చేయడానికి వీల్లేదని వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
నగరపాలక సంస్థ స్థలాల స్వాధీనంలో భాగంగా దుకాణాలు ఖాళీ చేయక తప్పదని అధికారులు సూచించారు. దీనిపై కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ గడువు (అక్టోబర్ 10) సోమవారం వరకు ఉందని, దీన్ని మరికొంత కాలం పొడిగించుకునే అవకాశం ఉన్న దృష్ట్యా షాపులు స్వాధీనం చేసుకోవడం కుదరదని వ్యాపారుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. షాపులకు సీల్ వేయకుండా అడ్డుకున్నారు. దీనిపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ హైడ్రామా నడిచింది. ఈ దుకాణాల సముదాయానికి వెనుక ఉన్న చేపలు, మాంసం మార్కెట్‌ను సైతం ఏడాది కిందట అధికారులు ఖాళీ చేయించారు. దానిని ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా నెలకొల్పిన సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌కు తరలించారు. అయితే, ఐదారుగురు వ్యాపారులు మాత్రమే ఇక్కడి నుంచి అక్కడికి తరలివెళ్లారు. మిగిలిన వారంతా ఈ దుకాణాల వెనుక భాగంలోనే తాత్కాలికంగా తడికెలు ఏర్పాటు చేసి మేకలు, గొర్రెలను ఉంచుతున్నారు. షాపులు, వెనుక ఉన్న చేపల మార్కెట్ స్థలమంతా ఖాళీ చేయాల్సిందేనని అధికారులు హుకుం జారీ చేశారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి ఆధ్వర్యంలో డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం 19 షాపులను ఖాళీ చేయించి సీజ్ చేశారు. అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీలు రామోజీరమేష్, ఆంజనేయులు, బస్వారెడ్డి, నగరంలోని అన్ని స్టేషన్ల సీఐలు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఒక దశలో ఫ్లకార్డులు పట్టుకుని బాధితులు వైరా రోడ్డుపై నిరసన తెలిపారు. మంత్రి పువ్వాడ అజరుకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ వైపు వ్యాపారులు ఆందోళన చేస్తుండగానే.. మరోవైపు సోమవారం రాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య షెట్టర్లను కూల్చేశారు.
షాపులు పోతే బతుకులు ఎట్టా..?
షాపులు సీజ్ చేస్తే బతుకులు ఎట్టా? అని బాధితులు వాపోయారు. దశాబ్దాల కాలంగా కార్పొరేషన్‌కు కిరాయిలు, పన్ను చెల్లిస్తూ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నామని.. ఈ దుకాణాల మీదనే ఆధారపడిన తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫర్నీచర్, చికెన్, మటన్ సెంటర్లు, ఇతరత్ర చిరువ్యాపారాలు నిర్వహించుకుని బతికే తమను ఉన్నపళంగా ఖాళీ చేయిస్తున్నారని వాపోతున్నారు. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా ఖాళీ చేయిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇక్కడి నుంచి వేరే చోటకు వెళ్తే వ్యాపారాలు సాగటం కష్టమని, ఇప్పటికే రైతుబజార్, పాతబస్టాండ్, నగర పాలకసంస్థ కార్యాలయాలను తరలించడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు
కన్నీటి పర్యంతమవుతూనే దిక్కుతోచని స్థితిలో షాపులు ఖాళీ చేశారు. మరోవైపు దుకాణాలు ఖాళీ చేయించడంతో వీటికి ఆనుకుని తాత్కాలికంగా ఉంటున్న మాంసం, చేపల వ్యాపారుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఆ తాత్కాలిక దుకాణాలనూ తొలగించి మొత్తం స్థలాన్ని స్వాధీనం చేసుకుం టామని అధికారులు తెలిపారు.