Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో వందలాది మంది బైటాయింపు
- పెద్ద ఎత్తున తరలొచ్చిన మహిళా వీఆర్ఏలు
- సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్
- పోలీసుల అత్యుత్సాహం...లాఠీచార్జి...పలువురికి గాయాలు
- లాక్కెళ్లి వాహనాల్లో కుక్కిన వైనం
- విడతలవారీగా రావడంతో తీవ్ర ఉద్రిక్తత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంగారు తెలంగాణలో మహిళా వీఆర్ఏలు బతుకమ్మ ఆడుకునేందుకు వీల్లేకుండా రాష్ట్ర సర్కారు అడ్డం పడింది. వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన వారిని ఇందిరాపార్కు వద్దకు చేరుకోకుండా వందలాది పోలీసులను మోహరించి అడ్డుకున్నది. తమ డిమాండ్లు సమాజానికి తెలిసేలా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బతుకమ్మ ఆడుకుంటామన్నా ససేమిరా అన్నది. అక్కడా పోలీసు బలగాలను మోహరించింది. వచ్చినోళ్లను వచ్చినట్టు..కనిపించినోళ్లను కనిపించినట్టు అరెస్టులు చేయించింది. ఇక, విధిలేని పరిస్థితుల్లో వందలాది మంది వీఆర్ఏలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో మెరుపు రాస్తారోకోకు దిగారు. 'వీ వాంట్ జస్టిస్..వీ వాంట్ జస్టిస్...ఇదేమి రాజ్యం..ఇదేమి రాజ్యం' అంటూ నినాదాలు చేశారు. ' వీఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలి...సీసీఎల్ఏ నిర్లక్ష్య వైఖరి నశించాలి...పేస్కేలు జీవో జారీ చేయాలి...వారసత్వ ఉద్యోగాలివ్వాలి...అర్హులకు ప్రమోషన్లు కల్పించాలి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడే బైఠాయించారు. పెద్ద ఎత్తున మహిళా వీఆర్ఏలు తరలిరావడంతో కొద్ది మంది పోలీసులు ఏమీ చేయలేకపోయారు. నచ్చజెప్పి అక్కడ నుంచి తరలించేందుకు యత్నించగా ససేమిరా అన్నారు. 'మూడు నెలల నుంచి సమ్మె చేస్తున్నాం..జీతాల్లేక దసరా పండుగ కూడా చేసుకోలేదు. మేమన్నా కొత్తగా అడుగుతున్నమా? సీఎం ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని అడుగుతున్నాం కదా? మీరూ ఉద్యోగులే..మేమూ ఉద్యోగులమే ఎందుకు ఇట్ల చేస్తున్నరు? ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్తామంటే అడ్డుకుంటారా? ఇదేం న్యాయం' అంటూ పోలీసుల్ని మహిళా వీఆర్ఏలు నిలదీశారు. దయచేసి నిరసనకు అడ్డు తగులొద్దంటూ చేతులెత్తి వేడుకున్నారు. 'బంగారు తెలంగాణలో బతుకమ్మ కూడా ఆడుకోనివ్వరా? మా బాధలు చెప్పుకోనివ్వరా? ఇదెక్కడి న్యాయం' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా వాగ్వివాదం జరుగుతున్న క్రమంలోనే ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున మోహరించిన బలగాలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు చేరుకున్నాయి. ఓవైపు వీఆర్ఏలనంతా తాడుతో నెడుతూనే..మరోవైపు ఒక్కొక్కరిని ఎత్తుకెళ్లి వాహనాల్లో పడేశారు. ఈ క్రమంలో మహిళా వీఆర్ఏలు పెద్ద ఎత్తున ప్రతిఘటించగా కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రశ్నించేవారిని ఐదారుగురు పోలీసులు టార్గెట్ చేసి మరీ ఎత్తుకెళ్లారు. కొందరు వీఆర్ఏలకు గాయాలు కూడా అయ్యాయి. పోలీసుల బూటు కాలు కింద పడి ఓ వీఆర్ఏ వేలుపొట్ట పగిలిపోయింది. కొందరు వీఆర్ఏలను బలవంతంగా తరలించే క్రమంలో దుస్తువులు కూడా చినిపోయాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్లను వెతికి మరీ పోలీసులు అరెస్టు చేశారు.
విడతలవారీగా వీఆర్ఏలు...లాఠీ ఝుళిపించిన డీసీపీ
మొదట విడతలో అక్కడ రాస్తారోకోకు దిగిన వారిని అరెస్టు చేసి వాహనాల్లో కుక్కి గాంధీనగర్, ఆబిడ్స్, చిక్కడపల్లి, బేంగపేట, రాంగోపాల్‌పేట, తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. హమ్మయ్య అయిపోయింది...అని పోలీసులు ఊపిరి పీల్చుకుంటుండగానే రెండో విడతలో వచ్చిన వీఆర్ఏలు రోడ్డుపైకి పరుగెత్తుకొచ్చి నినాదాలు చేయడం మొదలెట్టారు. వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ చక్కదిద్దుతున్న క్రమంలోనే మరోసారి ఇందిరాపార్కు వైపు నుంచి వచ్చిన వీఆర్ఏలు క్రాస్‌రోడ్డులో బైఠాయించారు. 'అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీనిచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, అర్హులకు ప్రమోషన్లకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలి' అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న డీసీపీ ఒక్కసారిగా వీఆర్ఏలపై లాఠీ ఝళిపించారు. ఇద్దరు వీఆర్ఏలను కొట్టారు. గదమాయించి అక్కడ నుంచి వారిని లేచేలా చేశారు. మిగతా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్‌రోడ్డు పరిసర ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. మెట్రోస్టేషన్ మెట్లు ఎక్కి వెళ్లి అక్కడ ఉన్న వీఆర్ఏలను గుర్తించి అరెస్టు చేశారు. షాపుల ముందు, హోటళ్ల ముందు నిలబడ్డ వారినీ వదిలిపెట్టలేదు. వీఆర్ఏ అని భావిస్తే చాలు...వారిస్తున్నా వినకుండా తీసుకెళ్లి వాహనాల్లో పడేశారు. దీంతో అరగంట పాటు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
జేఏసీ నేతల ముందస్తు అరెస్టు
జిల్లాల నుంచి వీఆర్ఏలు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని గాంధీనగర్, చిక్కడపల్లి, తదితర పీఎస్‌లకు తరలించారు. ఆబిడ్స్, గాంధీనగర్ పోలీస్స్టేషన్లలో మహిళలు నినాదాలు చేశారు. చప్పట్టు కొడుతూ బతుకమ్మ పాడుతూ తమ నిరసన తెలిపారు.