Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ దివాళాకోరు కోమటిరెడ్డి
- మతోన్మాదులను చిత్తుగా ఓడించండి: చండూరు సభలో తమ్మినేని, కూనంనేని
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
''మునుగోడు ప్రజల నమ్మకాన్ని అమ్ముకున్న నువ్వా కమ్యూనిస్టులను విమర్శించేది.. కమ్యూనిస్టులపై మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. రాజకీయ వ్యభిచారివి నువ్వు'' అని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో చండూరు పట్టణ కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగిస్తూ.. ఎర్రజెండాను మాటంటే పడటానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. 'నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేది మేమైతే, నమ్మిన వాళ్లను నట్టేట ముంచి అమ్ముడుపోయేది నీవే అన్న సంగతి గుర్తుంచుకోవాలి' అని హెచ్చరించారు. 'కమ్యూనిస్టులపై విమర్శలు చేస్తూ మాట్లాడటానికి సిగ్గుండాలే.. గతంలో ఇదే కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచిన విషయాన్ని మరిచిపోయావా.. నువ్వా మాకు పాఠాలు చెప్పేది' అని ఘాటుగా విమర్శించారు. మునుగోడు అంటేనే ఎర్రజెండాకు అడ్డా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో తాము ఐదుసార్లు గెలిచామని, ఆ తర్వాత ఇక్కడ ఎవరు గెలిచినా తమ మద్దతుతోనే విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. 8ఏండ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రజలకు ఒరగొబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి 15కోట్ల ఉద్యోగాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని చెప్పారు. సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు, లౌకిక ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని చెప్పారు. రాష్ట్రాల పన్నుల హక్కును కూడా జీఎస్టీ పేరుతో స్వాధీనం చేసుకుందన్నారు. గుజరాత్లో లైంగికదాడి కేసుల్లో నేరస్థులకు సన్మానాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.22వేల కాంట్రాక్టు కోసం మూడేండ్ల నుంచి బీజేపీతో టచ్‌లో ఉన్నానని చెపుకుంటున్నారని, ఇంతకంటే దారుణం మరోకటి ఉండదన్నారు. నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చి ఉచిత కరెంట్ వద్దని, మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రంపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం ఉద్యమించే శక్తులపై కేంద్ర ప్రభుత్వం రాజద్రోహం పేరుతో కేసులు పెట్టి వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐలను ప్రయోగించి లొంగదీసుకుని.. బీజేపీలో చేర్చుకుంటోందన్నారు. మత ఘర్షణల పేరుతో దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తిప్పికొట్టడానికి కమ్యూనిస్టులు నిరంతరం పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టుల మార్గంలోకి వచ్చారని చెప్పారు. మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేస్తే తప్పులేదన్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
కమ్యూనిస్టులపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలే..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కమ్యూనిస్టులపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలె అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేస్తే తప్పులేదన్నారు. గతంలో కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచిన విషయాన్ని రాజగోపాల్‌రెడ్డి మరిచిపోయి మాట్లాడుతున్నారన్నారు. ''ఇప్పుడు కమ్యూనిస్టులపై విమర్శలు చేస్తూ మాట్లాడటానికి సిగ్గుండాలే నీకు.. నువ్వా మాకు పాఠాలు చెప్పేది'' అని అంటూ ఘాటుగా విమర్శించారు.
దేశంలో ఏ పార్టీ కూడా పొత్తుల్లేకుండా లేదని, కమ్యూనిస్టులకు ఎత్తుగడలుంటాయని చెప్పారు. 'ఎవరితో కలిసుండాలే.. ఎవరితో రాజకీయవైరం ఉండాలి అనేది మన ఇష్టం'' అన్నారు. డబ్బులు పంచి, కులమతాల పేరుతో వచ్చే అధికారం తమకొద్దని, ప్రజలు నేరుగా అధికారం ఇచ్చిన రోజే తీసుకుంటామన్నారు. మనకు మంచి రోజులు రావడం ఖాయమని, తప్పకుండా ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేశారు. మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులను ఓడించేందుకు.. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కమ్యూనిస్టుల వల్లే గెలిచామనే భావన కలిగేలా చేయాలన్నారు. ప్రతి కార్యకర్త కూడా తానే అభ్యర్థిని అనే విధంగా పనిచేయాలని, తప్పకుండా ఈ ఎన్నికలో దాదాపు 50వేల మోజార్టీతో గెలుస్తామన్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు.
గతంలో పొరపాట్లు జరిగితే క్షమాపణ కోరుతున్న ..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
గతంలో కమ్యూనిస్టుల పట్ల ఏమైనా పొరపాట్లు జరిగినట్టయితే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో ఎర్రజెండా సోదరులందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. తాను విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలంతో పెరిగానని, కష్టం ఉన్నచోటనే మనం ఉండాలన్న కోరిక తమ కుటుంబం నుంచి వచ్చిందని అన్నారు. మనిషిని ఎక్కడున్నా ఆలోచన మాత్రం కమ్యూనిస్టు భావజాలమేనన్నారు. గతంలో ఈ ప్రాంత సమస్యల కోసం సీపీఐ(ఎం), సీపీఐ అనేక పోరాటాలు చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సాగు, తాగునీరు లేక అల్లాడుతున్న సమయంలో ఫ్లోరోసిస్ సమస్య వెంటాడిందన్నారు. దాని నుంచి విముక్తి పొందేందుకు మొదటిసారి తాను ఎమ్మెల్యే కాగానే రూ.2వేల కోట్లతో శివన్న గూడెం, లక్ష్మణపురం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయించానని చెప్పారు. అవి నేడు పురోగతిలో ఉన్నాయని, భవిష్యత్‌లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. గతంలో కమ్యూనిస్టుల పట్ల ఏమైనా పొరపాటుగా ప్రవర్తించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని, రానున్న రోజుల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
తరలివచ్చిన జనసంద్రం
బహిరంగ సభకు జనం వేలాదిగా తరలించారు. పట్టణమంతా ఎర్రజెండాలతో రెపరెపలాడింది. అనేకమంది కార్యకర్తలు ఎర్ర చొక్కా ధరించి సభకు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో మహిళల కోలాటాలు, నృత్యాలు, కళాకారులు పాడిన పాటలకు జనం నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ప్రాణం ఉన్నంతవరకూ ఎర్రజెండాను భుజాన మోస్తామనే నినాదాలు సభలో దద్దరిల్లాయి. ఫాసిస్టు సిద్ధాంతంతో ప్రజలపై దాడి చేసే వారికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేస్తామని కార్యకర్తలు ప్రతినబూనారు.మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సభలో కళాకారులు పాడిన పాటలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. బహిరంగ సభలో సుమారు పది వేల మందికిపైగా పాల్గొన్నారు. సీపీఐ(ఎం), సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నెల్లికంటి సత్యం అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీపీఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఇరు పార్టీల నాయకులు పల్లా వెంకటరెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, ఉజ్జిన రత్నాకర్‌రావు, ఎండి. జహంగీర్, గోదా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.