Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, యూటీఎఫ్ కార్యదర్శులు నివాళి
- అంత్యక్రియలు పూర్తి
నవతెలంగాణ-బోనకల్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉపాధ్యాయ, వామపక్ష ఉద్యమాలకు ఉద్యమ వీరుడిగా నాగటి నారాయణ నిలిచారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పెద్ద బీరవల్లి గ్రామంలో మంగళవారం యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలు, యూటీఎఫ్ నాయకులు, జిల్లా కార్యదర్శులు, సీపీఐ(ఎం) ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీఎస్ యుటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోదా వెంకట నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని మాట్లాడారు. అమరవీరుల త్యాగాలు, వారి పోరాటాలు మనందరికీ ఆదర్శమన్నారు. నారాయణ చిన్నప్పటి నుంచి అభ్యుదయ భావాలతో పెరిగి రాష్ట్రానికే నాయకుడిగా ఎదిగాడన్నారు. ఖమ్మం పూర్వ యూటీఎఫ్ ఉద్యమంలో ఎనలేని ప్రధాన పాత్ర పోషించాడని కొనియాడారు. తాను నారాయణ అనేక ఏండ్లుగా కలిసి పని చేశామని తెలిపారు. ఆయన చర్చలో పాల్గొనే సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేవారని, కచ్చితత్వం ఆయనలో కనపడేదన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నారాయణ నిలిచాడు అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. నారాయణ అకాల మరణం ఉపాధ్యాయ రంగానికి ఎంతో తీరని లోటు అన్నారు.
ఉపాధ్యాయ రంగానికి, సమాజానికి తీవ్ర నష్టం- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నారాయణ వృతి విద్యా రంగానికి, సమాజానికి తీవ్ర నష్టమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ రంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో నారాయణ రాష్ట్ర నాయకత్వం స్థానంలోకి వచ్చి వాటి పరిష్కారంలో కీలకపాత్ర పోషించాడని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారాయణ చేసిన పోరాటాల ఫలితంగా సాధించిన విజయాలను నేడు ఉపాధ్యాయ రంగం అనుభవిస్తుందన్నారు. యూటీఎఫ్ పత్రిక ప్రధాన సంపాదకుడుగా పని చేశాడన్నారు. అనంతరం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ రంగ సమస్యలపై పోరాటం చేస్తూనే సామాజిక న్యాయం కోసమూ నారాయణ ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. ఉపాధ్యాయ రంగ సమస్యలపై ఒక దశలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీవేమైనా మొనగాడివా అంటూ నారాయణను బెదిరించిన బెదరలేదన్నారు. అప్రెంటీస్ విధానం రద్దు చేసే వరకు పోరాటం చేసి విజయం సాధించారని గుర్తుచేశారు.
విజ్ఞానగని నారాయణ : ఏపీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
నాగటి నారాయణ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలని, ఆయన విజ్ఞాన గని లాంటివారని ఆంధ్రప్రదేశ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, సబ్జీ కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము నారాయణతో కలిసి ఉపాధ్యాయ రంగ సమస్యలపై అనేక పోరాటాల్లో పనిచేశామని తెలిపారు. యూటీఎఫ్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి ఉపాధ్యాయులకు దిక్సూచిగా మార్చారన్నారు. అనంతరం ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారంలో, పోరాటంలో నారాయణ దిట్ట అని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పీఆర్సీ అమలుకు జరిగిన పోరాటంలో నారాయణ కృషి అమోఘమని ఉపాధ్యాయ సంఘాలు ఆనాడు కొనియాడారని గుర్తుచేశారు.
సీపీఐ(ఎం) ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలకు భయపడకుండా వారి మెడలు వంచి పోరాటం చేయగల సమర్థుడు నారాయణ అని కొనియాడారు. భద్రాచలంలోని ఓ మారుమూల గ్రామంలో ప్రారంభమైన నారాయణ పోరాటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించిందన్నారు.
ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.దుర్గ భవాని, ఏపీ యుటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మూరి శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మన్నేపల్లి సుబ్బారావు, ప్రయివేట్ లెక్చరర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మాట్లాడారు.
నారాయణ పాడే మోసిన ఎమ్మెల్సీలు
సంతాప సభ అనంతరం నారాయణ మృతదేహానికి పెద్దబీరవల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. తెలంగాణ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలు వి.బాల సుబ్రహ్మణ్యం, ఐ. వెంకటేశ్వరరావు, సాబ్జీ, టీఎస్ యూటీఎప్˜్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తదితరులు నారాయణ పాడెను మోశారు.
విద్యారంగానికి తీరనిలోటు
- నాగటి నారాయణ మరణం పట్ల చెరుపల్లి సంతాపం
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) సీనియర్ నేత నాగటి నారాయణ ఆకస్మిక మరణం పట్ల సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం ఉపాధ్యాయ, విద్యారంగంతోపాటు సామాజిక ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన అధిక ఫీజులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. అంతరాల్లేకుండా అందరికీ నాణ్యమైన, సమానమైన విద్య కోసం పోరాడటమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.