Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైసలెక్కువిస్తే పార్టీ మారుడే...కండువా కప్పుకునుడే..
- కొనుగోళ్ల పర్వంలో రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక స్కీమ్‌లు!
- వార్డు మెంబర్కూ ఐదారు లక్షలు ఇస్తామంటూ బేరసారాలు
- సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మారితే 20 లక్షలంట
- సొంత పార్టీ మీటింగ్లకెళ్లినా కార్యకర్తలకు పైసలివ్వాల్సిందే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గతంలో ఎమ్మెల్సీ...ఎంపీ...ఎమ్మెల్యే ఎన్నికల్లో పైసలతో రాజకీయాల్ని కంపు చేసిన రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు తెచ్చిన ఉప ఎన్నిక కాస్తా మునుగోడు ప్రజల్లో పార్టీలంటేనే ఏహ్యభావం పుట్టేలా చేస్తున్నది. రోజుకో పార్టీ కండువా మార్చుకుంటూ ఆ గట్టు మాదే..ఈ గట్టు మాదే అన్నట్టు వ్యవహరిస్తున్న నేతల తీరును చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. వార్డు మెంబర్‌కు పలుకుబడిని బట్టి ఐదారు లక్షలిస్తుంటే..సర్పంచ్‌లకు రూ.15 నుంచి 20 లక్షల వరకు, మండల స్థాయి నాయకులకు లక్షలాది రూపాయలతో పాటు కార్లను కొనిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. చేరికల కోసం బీజేపీ ప్రత్యేక స్కీమ్‌లు తీసుకొచ్చినట్టు చర్చ నడుస్తున్నది. సొంత పార్టీ మీటింగ్లకెళ్లినా యువ నాయకులకు, గ్రామ నాయకులు కూడా తమకూ డబ్బులివ్వాలని లిస్టు రాసివ్వడాన్ని చూస్తే ఎవ్వరైనా విస్తుపోవాల్సిందే.
అభివృద్ధి ముసుగేసుకుని రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం రాజగోపాల్‌రెడ్డి తీసుకొచ్చిన ఉప ఎన్నిక మునుగోడు ప్రజల్లో విష బీజాల్ని నాటుతున్నది. ఆ నియోజకవర్గంలో పదేండ్ల కిందటి దాకా ఓ పార్టీ చెందిన కుటుంబం అంటే అక్కడ నాయకులు ఓటు కూడా అడగకపోయేవారు. ఆ కుటుంబానిది పక్కా కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీఆర్ఎస్ అని ముందే నిర్దారించుకుని ప్రచార సమయంలో అటువైపు మొహం కూడా చూపకపోయేవారు. తటస్థులను తమకు ఓటేయాలని ప్రాధేయపడేవారు. పాల్వాయిగోవర్ధన్రెడ్డి, ఉజ్జిని నారాయణరావు, యాదగిరిరావు, పల్లా వెంకట్రెడ్డిలున్న సమయంలో పైసల రాజకీయాలు లేవు. కొనుగోళ్ల పర్వం అస్సలే లేదు. ఎప్పుడైతే రాజగోపాల్‌రెడ్డి అక్కడ అడుగుపెట్టాడో రాజకీయాలను మొత్తం కలుషితం చేసేశారు. గత ఎన్నికల్లో ఆయా పార్టీల నాయకులను కొనుగోళ్లు చేసి ఓ హైప్ సృష్టించి ఆయన
గెలిచారు. ఇప్పుడు తన స్వలాభం కోసం తీసుకొచ్చిన ఉప ఎన్నికలో బీజేపీకి అంతగా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పైసలతో రాజకీయాటకు తెరలేపారు. ఎంపీటీసీలు, సర్పంచ్ల ను కొనేసుకుంటూ ప్రజలంతా తమవైపే ఉన్నారని చూపెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 200 కుటుంబాలను చేర్పిస్తే ఇన్నోవా క్రిస్టా కారు, 400 కుటుంబాలను చేర్పిస్తే హైదరా బాద్‌లో ఇల్లు కట్టిస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ పర్వంలో తామెక్కడ వెనుకబడి పోతామో అనే భయంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయా పార్టీల మండల, గ్రామ స్థాయి నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునే పనిలో పడింది. మర్రిగూడెం మండలం దామెర భీమనపల్లి సర్పంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్లారు. తాజాగా ఆయన బీజేపీ గట్టుకు చేరారు. దీనికిగానూ ఆయనకు పెద్దమొత్తం లో ముట్టినట్టు సమాచారం. మర్రిగూడెం మండలానికి చెందిన ఓ నేతకు రాజగోపాల్‌రెడ్డి కారు కూడా కోనిచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. కొండూరు సర్పంచ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి అక్కడ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. చండూరు మండలం దోనిపాములలో గ్రామ నాయకుల్లో కొందరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. అక్కడ నేతల తీరుతో ఇమడలేక మళ్లీ టీఆర్ఎస్ బాట పట్టారు. ఆ మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లోనూ స్థానిక ప్రజాప్రతినిధులు రోజుకో పార్టీ మారుతున్న పరిస్థితి.
చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. రాష్ట్ర ప్రభుత్వం గట్టుప్పల మండలం ప్రకటన హామీతో ఆయన టీఆర్ఎస్లో చేరారు. తీరా, మండలం ఇచ్చాక కోమటిరెడ్డి బ్రదర్స్ ఒత్తిడితో ఆ గ్రామానికి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీటీసీలను తీసుకుని బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో వెంకటేశానికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టినట్టు ప్రచారం జరిగింది. వారం వ్యవధిలోనే ఆయన మళ్లీ టీఆర్ఎస్లో చేరారు. చౌటుప్పల్ ఎంపీపీ మొదట కాంగ్రెస్‌పార్టీకి చెందిన వ్యక్తి. రాజగోపాల్‌రెడ్డితో పొసగక టీఆర్ఎస్లోకి వెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. మళ్లీ ఆయన గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. మునుగోడు మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ సర్పంచ్‌లను రాజగోపాల్‌రెడ్డి ప్రలోభాలకు గురిచేసి తనవైపు తిప్పుకున్నారనే విమర్శ ఉంది. వారు ఆ పార్టీలో పొసగలేకపోతున్నారనే చర్చా నడుస్తున్నది. గట్టుప్పల మండల ప్రారంభోత్సవం అనంతం జరిగిన సభలో కొందరు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. బీజేపీలో చేరితే ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తున్నారనే ప్రచారంతో నాలుగురోజులకే వారు రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అక్కడ వారికి ఒకొక్కక్కరికి రెండు నుంచి మూడు వేల రూపాయలు, బీరూ, బిర్యానీ ముట్టజెప్పిట్టు పంపారని సమాచారం. చాలా గ్రామాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు అని తేడా లేకుండా పోయింది. ఏ మీటింగ్ పెట్టినా అందరూ వెళ్తున్నారు. ఇదేం పద్ధతి అని అడిగితే 'మేం ఉట్టిగ పోతలేం..కూలికి పోతే ఐదారొందలు వస్తరు. పని మానుకుని ఎవ్వడు పోతడు వాళ్లెంట? ఎవ్వడు పైసలిచ్చినా తీసుకుంటాం..తాగిపిస్తే తాగుతాం..ఓటేసేటప్పుడు నచ్చినోల్లకు వేస్తాం' అని చెప్పడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో నేతల తీరుతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఎవర్ని నమ్మాలో? ఎవర్ని నమ్మొద్దో తెలియక తికమకపడిపోతున్నారు. 'నాయకులు అమ్ముడు పోయినా మేం అమ్ముడుపోం..మాకు నచ్చినోళ్లకు ఓటేస్తాం' మరికొందరు ఓటర్లు చెబుతుండటం గమనార్హం. రోజుకోపార్టీ మారుతున్న నేతలంతా ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటారో వేచి చూడాల్సిందే.