Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి నలుగురిలో ముగ్గురిపై తీవ్ర ప్రభావం..చదువుకు దూరం..
- యుక్త వయస్సు బాలికల హాజరు 23శాతం.. పెరిగిన వివక్ష
- పేద, మధ్య తరగతి కుటుంబాల్లో..బాల్య వివాహాలు
గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని బాలికలు చదువుకు దూరమవుతున్నారని, ఇంటి చాకిరి పెరిగిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బాలికల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, బాల్య వివాహాలు చేసి పంపిస్తున్నారని 'ఎడ్యకేట్ గర్ల్స్' నివేదిక పేర్కొన్నది. స్వచ్ఛంద సేవా సంస్థగా గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యపై 'ఎడ్యుకేట్ గర్ల్స్' పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీలతో, వివిధ ఎన్జీవో సంఘాలతో కలిసి పనిచేస్తోంది. కరోనా, లాక్డౌన్ తర్వాత బాలికల చదువుపై అధ్యయనం చేయగా..అందులో వెలువడ్డ ముఖ్యాంశాల్ని తాజాగా మీడియాకు విడుదల చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కరోనా తర్వాత పేద, మధ్య తరగతి కుటుంబాల్లో బాలికలు ఇంటి చాకిరితో సతమతమవుతున్నారు. విద్యకు మునుపెన్నడూ లేనంతగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చదువు మానేయటం, వివక్ష, బాల్య వివాహాలు..ఇవన్నీ అసమానతల్ని మరింత పెంచుతున్నాయి. కరోనా మహమ్మారి, లాక్డౌన్..దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతోందని మా అధ్యయనం గుర్తించింది''
- ఎడ్యుకేట్ గర్ల్స్, ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం మొదలయ్యాక మనదేశంలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో బాలికలు ఇంటి పనికి పరిమితమయ్యారు. వారి పట్ల వివక్ష మరింత పెరిగింది. అయితే పాఠశాలలు తెరుచుకున్న తర్వాత పూర్వంలా బాలికలు చదువును కొనసాగించ లేకపోతున్నారు. సర్వేలో భాగంగా వేలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలు, వారి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయగా, బాలికలపై వివక్ష, ఇంటి పనిభారం పెరిగిందని తేలింది.
అమ్మాయిలు..ఇంటికే పరిమితం
కరోనా మహామ్మారితో 15-18ఏండ్ల బాలికలకు ఇంటి చాకిరి ఎక్కువైంది. క్రితంతో పోల్చితే ఇంటివద్ద పనిగంటలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. టీనేజీలో ఉండగానే పెండ్లి చేసి పంపించటం ఎక్కువైంది. వివాహం లేదా నిశ్చితార్థం జరిగిందని సర్వేలో పాల్గొన్న బాలికల్లో 30శాతం మంది చెప్పారు. 15-18ఏండ్ల బాలికల్లో మూడోవంతు మునపటి కన్నా ఎక్కువగా ఇంటి పని మోస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్లు దీనికి కారణం. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని బాలికలందరిపైనా ప్రభావం కనపడింది. 2020లో 15లక్షలకుపైగా పాఠశాలలు మూసేశారు. దీంతో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో 24.7కోట్ల మంది పిల్లల చదువు దెబ్బతిన్నది. దీంతో బాలికల కష్టాలు మొదలయ్యాయి. తిరిగి పాఠశాలలు తెరుచుకన్నా.. మునపటిలా వారు చదువును కొనసాగించ లేకపోయారు. మహ మ్మారి తీసుకొచ్చిన మార్పులు వారి జీవితాల్ని తలకిందులు చేసిందనే చెప్పాలి.
మూసుకుపోయిన దారులు
- పాఠశాలలు తెరుచుకున్నాక..బాలికల హాజరు 94శాతం, బాలుర హాజరు 96శాతం నమోదైంది. అయితే 15-18 ఏండ్ల బాలికల హాజరు మాత్రం 23శాతం నమోదైంది.
- మునపటితో పోల్చితే 15-18ఏండ్ల బాలికల ఇంటి పని సమయం చాలా పెరిగింది. సగటున 3.5గంటలు కేటాయిస్తున్నారు.
- స్కూల్కు వెళ్లే ముందే ఇంటి పని పూర్తి చేయాల్సి వస్తోందని ఇంటర్వ్యూలో బాలికలు చెప్పారు.
- స్కూల్స్ ప్రారంభమైనా..ప్రతి నలుగురు బాలికల్లో ముగ్గురు ఇంటి పని భారాన్ని మోయాల్సి వస్తోంది.