Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా కొనసాగుతున్న గందరగోళం
- నాలుగు నెలలుగా టీఏఎఫ్ఆర్సీ కసరత్తు
- సర్కారు నాన్చుడు ధోరణి
- వెబ్ఆప్షన్లు నమోదు చేసేదెలా...
- ఆందోళనలో అభ్యర్థులు
- ఇంజినీరింగ్ రెండోవిడత కౌన్సెలింగ్ షురూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ రెండోవిడత కౌన్సెలింగ్ ప్రారంభమైనా ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. ఇంజినీరింగ్ ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలియకుండా వెబ్ఆప్షన్లు ఎలా నమోదు చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియెడ్‌కు సంబంధించి 173 ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నాలుగు నెలలుగా కసరత్తు చేసింది. వాటితో సంప్రదింపులు జరిపి ఫీజులను ఖరారు చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజు గరిష్టంగా రూ.1.60 లక్షలు, కనీసం రూ.45 వేలు ఉండాలని నిర్ణయించింది. ఎట్టకేలకు ఈనెల ఏడో తేదీన ఫీజు ప్రతిపాదనలతో కూడిన దస్త్రాన్ని ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఇదే సమయంలో ఇంజినీరింగ్ ప్రవేశాల రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. బుధవారం నుంచి వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదీ రెండురోజులే (బుధ, గురువారం) సమయమున్నది. మంగళవారం నాటికే ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయాలి. లేదంటే గత విద్యాసంవత్సరంలో అమల్లో ఉన్న ఫీజులే ఉంటాయని స్పష్టత ఇవ్వాలి. లేదంటే వెబ్ఆప్షన్లు నమోదు చేసే అభ్యర్థులు అయోమయానికి గురవుతారు. ఇప్పటికే రాష్ట్రంలో 92 ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. టీఏఎఫ్ఆర్సీతో ఒప్పందం కుదుర్చుకున్న ఫీజుల వసూలుకు ఆయా కాలేజీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఈ గందరగోళం మరింత ఎక్కువైంది. హైకోర్టు అనుమతి ఇచ్చిన కాలేజీల్లో ఏ ఫీజు చెల్లించాలనే దానిపై టీఏఎఫ్ఆర్సీ, ఇటు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎంసెట్‌లో పది వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే భరిస్తుంది. ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. మరి ఇతర విద్యార్థులు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో స్పష్టత లేకుండా ఆప్షన్ ఎలా ఇవ్వాలన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అలా ఇస్తే భవిష్యత్తు లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత?, ఆ కాలేజీ ఫీజు ఎంత?, విద్యార్థి ఎంత చెల్లించాలో అంచనా వేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఫీజు ఉత్తర్వులు జారీ చేస్తేనే అభ్యర్థుల్లో ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి. ఇంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఇంజినీరింగ్ ఫీజుల ఉత్తర్వుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తున్న దంటూ పలువురు విద్యావేత్తలు విమర్శిస్తు న్నారు. బుధవారం ఉదయనికల్లా ఉత్తర్వులు విడుదల చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నేటినుంచి వెబ్ఆప్షన్ల నమోదు
ఇంజినీరింగ్ ప్రవేశాల రెండోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైందని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం 3,374 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. బుధవారం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
అదేరోజు నుంచి వెబ్ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. గురువారం వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు గడువుందని పేర్కొన్నారు. ఈనెల 16న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఇతర సమాచారం కోసం https://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలని కోరారు.
ఇంజినీరింగ్‌లో 22,820 సీట్లు
ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రెండోవిడత కౌన్సెలింగ్‌లో 22,820 సీట్లు అందుబాటులో ఉన్నాయని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), దానికి అనుబంధంగా ఉన్న కోర్సుల్లో 16,776 సీట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో 4,424 సీట్లు, సివిల్, మెకానికల్ అనుబంధ కోర్సుల్లో 1,331 సీట్లు, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 289 సీట్లున్నాయని వివరించారు.