Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎత్తి చూపినందుకే నాపై కక్ష
- కీర్తి రెడ్డితో ప్రాణ భయం....పోలీసు కల్పించాలి
- ప్రభుత్వానికి టెకీ ప్రదీప్ మానుకొండ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫేస్బుక్లో లోపాలను ఎత్తి చూపి నందుకు ఆ సంస్థ యాజమాన్యం తనపై కక్ష కట్టిందని హైదరాబాద్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, పెనెట్రేషన్ టెస్టర్, సైబర్ డిఫెన్స్ కన్సల్టెంట్ (టెకీ) ప్రదీప్ మానుకొండ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తన తరపు న్యాయవాదితో కలిసి ఆయన మాట్లాడారు. ఫేస్ బుక్ ఇండియా ఆపరేషన్స్ మాజీ ఎండీ కీర్తిగ రెడ్డితో తనకు ప్రాణభయం ఉందనీ, వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో రెండు సార్లు తనపై దాడి జరిగిందని గుర్తుచేశారు. చర్చలకు పిలిపించిన ఆమె... తనను కులం పేరుతో దూషించారని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను ఆమెపై మోపిన అభియోగాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ కోసం సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసిందన్నారు. నవంబర్ 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించిందని చెప్పారు.
సైబర్ సెక్యూరిటీపై చర్చిద్దామంటూ 2010లో కాలిఫోర్నియాలోని ఫేస్బుక్ కార్యాలయం ఈ-మెయిల్ ద్వారా తనను పిలిచిందనీ, వారి కార్యాలయంలో ప్రజంటేషన్ ద్వారా పేస్బుక్ లోపాలను, మోసాలను తాను వివరించినట్టు ప్రదీప్ తెలిపారు. అదే రోజు తాను ఫేస్ బుక్ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించానంటూ అక్కడి పోలీసులతో కేసు నమోదు చేయిస్తానని పేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ బెదిరించారని వాపోయారు. తనపై సివిల్ వేధింపులు, సైబర్ వేటగాడు అంటూ కాలిఫోర్నియాలోని శాంతా క్లారా సుపీరియర్ కోర్ట్‌లో కేసు వేశారని తెలిపారు. తాను జుకర్ బర్గ్‌పై గ్లోబల్ హ్యూమిలియేషన్, పరువు నష్టం కింద 100 మిలియన్ డాలర్లు దావాను కాలిఫోర్నియాలోని స్టేట్ జ్యూడిషల్ కమిషన్‌లో వేశానని ప్రదీప్ వెల్లడించారు. 2014 సంవత్సరంలో హైదరాబాద్ కు తిరిగొచ్చేసి స్థిరపడినట్టు తెలిపారు. ఆ సమయంలో కీర్తిగ రెడ్డి ఉడుమల్ల చర్చల కోసం తనను హైదరాబాద్ కార్యాలయానికి ఆహ్వానించారని తెలిపారు. హైదరాబాద్ ఫేస్బుక్ కార్యాలయం ఎదుట ఉన్న వెస్ట్రన్ హౌటల్‌కు తనను పిలిపించి కాలిఫోర్నియాలోని స్టేట్ జ్యూడిషల్ కమిషన్‌లో తాను వేసిన కేసులను ఉపసంహరించుకోవాలనీ, లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు కేసు మూసివేశారనీ, కనీసం ఆ విషయాన్ని కోర్టుకు కూడా తెలపలేదని ఆరోపించారు. పోలీసులు స్పందించకపోవడంతో మళ్ళి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసి తనకు న్యాయం చేయాలని కోరానని తెలిపారు. చివరకు తన వాదనలను, సాక్ష్యాధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా ఎస్.సి/ఎస్.టి కేసుల సెషన్స్ కోర్టు ఎస్ ఎస్ (అత్యాచారాల నిరోధక) సవరణ చట్టం-2016లోని సెక్షన్ 3(1), (ఎస్) కింద కోర్టు ఎదుట హాజరు కావాలంటూ కీర్తిగ రెడ్డిని ఆదేశించిందని వివరించారు. ఈ కేసు మళ్లీ విచారణకు వస్తున్న నేపథ్యంలో కీర్తిగ రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని లేకుండా.. భద్రత కల్పించాలని కోరారు.