Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పాత్ర ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు గుండాల్లాగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారి మాటలు వింటున్న పోలీసులు నీచంగా వ్యవహరించొద్దంటూ హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేసిందనీ,ఈ క్రమంలో తానూ ప్రచారంలో పాల్గొంటానని వివరించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రచారానికి వస్తారా? అనే ప్రశ్నకు వచ్చే అవకాశం ఉందంటూ సమాధానమిచ్చారు. తమ పార్టీ కార్యాలయాన్ని తగలబెడుతుంటే, డీజీపీ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి పోలీసులను వదలబోమని హెచ్చరించారు.
ప్రశాంత్ కిషోర్ బీజేపీకి అనుకూలం : వీహెచ్
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పోరాడుతుంటే, ప్రశాంత్ కిషోర్ మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. రాహుల్ గాంధీ లాగా ఆయన పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారని గుర్తు చేశారు. ఎవరి ప్రయోజకం కోసం యాత్ర చేస్తారంటూ ప్రశ్నించారు. బీజేపీకి తొత్తుగా బీహార్ సీఎం నితీష్ కుమార్కు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.