Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీ తొట్టికింద సపరేట్ ఛాంబర్
- సుమారు 20 ప్యాకెట్లలో 100కిలోల గంజాయి
- చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
- లారీ వదలి నిందితులు పరార్ : మానుకోట ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ-మరిపెడ
నిషేధిత పదార్థాలు స్మగ్లింగ్ చేసినా, రవాణాకు సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని మహ బూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సినీ ఫక్కీలో లారీ వెనుక తొట్టికి కింది భాగంలో ఓ సపరేట్ ఛాంబర్ రూపొందించి, అందులో ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్న సుమారు 100కిలోల నిషేధిత ఎండు గంజాయిని మరిపెడ సీఐ సాగర్ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. మంగళవారం మరిపెడ పీఎస్‌లో ఎస్పీ వివరాలు వెల్లండించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 10న సీఐ సాగర్ నేతృత్వంలో ఖమ్మం కాకతీయ కళాతోరణం వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రాజస్తాన్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్, క్లీనర్, మరొకరు పోలీసులను చూసి ఓ ఫిల్లింగ్ స్టేషన్ పక్కన వాహనాన్ని ఆపి పరారయ్యారు. లారీ ఖాళీగా ఉండటం, ముందు క్యాబిన్లో ఏమి లేకపోవటం, డ్రైవర్, క్లీనర్ పోలీసులను చూసి పరారవ్వడంతో తొట్టిని పరిశీలించి అనుమానంతో స్థానిక వెల్డర్ వద్దకు లారీని తీసుకెళ్లి తొట్టిని కట్ చేయించారు. కింద భాగంలో సపరేట్గా ఉన్న ఓ ఛాంబర్లో సుమారు 20ప్యాకెట్లు మొత్తం 100కిలోల గంజాయిని గుర్తించి నిర్ధారించారు. మార్కెట్లో దీని విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుంది. లారీ, గంజాయిని స్వాధీనం చేసుకుని లారీ ఓనర్, పరారైన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. లారీ.. రాజస్తాన్‌లోని మహిపాల్ పాచా, జోద్ పూర్‌కు చెందిన సిద్దిక్ ఖిన్ స్వర్, బాన్సిగా గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ఏ. రఘు, సీఐ ఎన్.సాగర్ నాయక్, మరిపెడ ఎస్‌హెచ్‌వో దూలం పవన్‌కుమార్, ఎస్ఐ సంతోష్, పీసీ క్రాంతి కుమార్, తదితరులున్నారు.