Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులకు తప్పనిసరిగా పోడు భూములకు పట్టాలు అందజేస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం రుద్రారం గ్రామస్తులు పోడు భూముల అంశంపై మంగళవారం కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సాగు చేస్తున్న వారిని కాకుండా ఇతరుల పేరుతో ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేశారని, పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి అన్యాయం చేసేలా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ఎఫ్ఆర్సీ కమిటీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే పోడు భూముల అంశంపై దరఖాస్తులు స్వీకరించామని, అటవీ సంరక్షణ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనులకు, 3 తరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరులకు మాత్రమే ఆర్వో.ఎఫ్.ఆర్ పట్టాలు అందిస్తామని తెలిపారు. సాంకేతికతను వినియోగిస్తూ శాటిలైట్ ఫోటోల ద్వారా పకడ్బందీగా 2005 కంటే ముందు సాగు భూమిని గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోడు భూముల సర్వే ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుల ఆధీనంలో భూమిసాగులో ఉండి సరైన ఆధారాలు అందించిన తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పట్టాల పంపిణీ చేస్తామని కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్, రైతులు నాగరాజు, చంద్రమొగిలి, నారాయణ, మహేష్, లక్ష్మీ, పొసక్క,మల్లక్క తదితరులు పాల్గొన్నారు.