Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన సీఈ శంకర్ నాయక్
నవతెలంగాణ-పెనుబల్లి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వియం బంజర సమీపాన ఎన్ఎస్పీ కాలువకి సోమవారం రాత్రి గండి పడింది. పొలాల్లోకి నీరు ప్రవహించడంతో పంటలు నీటమునిగాయి. ఎన్ఎస్పీ అధికారులు వెంటనే అప్రమత్తమై కాల్వ నీటిని మధిర బ్రాంచ్‌కి విడుదల చేశారు. మంగళవారం ఎన్ఎస్పీ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్ కాలువ పరిశీలించారు. కాలువ యూటీ వద్ద బొంగ పడి గండికి దారితీసిందన్నారు. వర్షం నీరు, సాగర్ నీరు కలిసి ప్రవహించడం వల్ల నీటి ఉధృతి పెరిగి కాలువ కట్టకు గండి పడిందని సీఈ తెలిపారు. వారం రోజుల్లో గండిని పూడ్చి రైతులకు పంట పొలాలకు నీరు అందిస్తామని తెలిపారు. వియం బంజరా నుంచి బయనగూడెం వరకు సాగర్ కాలువ కట్ట బలహీనంగా ఉంది. వేసవి కాలంలో కట్ట మరమ్మత్తు చేయించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కాల్వకు గండి పడి తమ పంట పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద ఎకరాల మేరకు వరిపంట ముంపునకు గురైనట్టు రైతులు తెలిపారు.గండిని పరిశీలించిన వారిలో ఎన్ఎస్పీ అధికారులు ఎస్సీ ఆనంద్ కుమార్, డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ కిరణ్ కుమార్, ఆర్డిఓ సూర్యనారాయణ, తహసీల్దార్ రమాదేవి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, కోమటి ప్రసాద్ పాల్గొన్నారు.