Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ కాంట్రాక్టుపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. : రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాలపై మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తనకు ఇటీవలే రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి బాహాటంగా ప్రకటించిన నేపథ్యంలో... సదరు కాంట్రాక్టుపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా... స్వయంగా విచారణను కోరాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వి) సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ... రాజగోపాల్‌రెడ్డి అక్రమ కాంట్రాక్టులపై మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అక్కడ ఉప ఎన్నిక రావటానికి ఒక కాంట్రాక్టరు బలుపే కారణమని విమర్శించారు. మునుగోడు ఓటర్లను అంగట్లో సరుకుగా కొనొచ్చని మోడీ భావించారనీ, ఆయన అహంకారమే ఉప ఎన్నికకు దారి తీసిందని తెలిపారు. కేవలం ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే... మునుగోడు నియోజకవర్గం మొత్తం బాగుపడ్డట్టు కాదన్నారు. అక్కడ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని విమర్శించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాలకు పయనమవటమే ఇందుకు నిదర్శమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజరుకుమార్, ఎమ్మెల్యే గాదరి కిశోర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గూటికి కర్నాటి...
ఇటీవల గులాబీ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మంగళవారం తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆయన... తనను బలవంతంగా బీజేపీలోకి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో చేరిన తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని తెలిపారు. మునుగోడుకు చెందిన సీనియర్ నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వరరావు కూడా కేటీఆర్ సమక్షంలో తిరిగి టీఆర్ఎస్లో చేరారు.
ప్రమాద బీమా ప్రీమియం చెల్లింపు...
పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిన టీఆర్ఎస్... వరసగా ఏడో సంవత్సరం సంబంధిత ప్రీమియాన్ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. మంగళవారం ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రీమియం తాలుకూ చెక్కును కంపెనీకి అందించారు.