Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వంటగ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి ఓటేయం'
- గ్రామాల్లో దర్శనమిస్తున్న బోర్డులు
- అడుగడుగునా వ్యతిరేకతే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ప్రచార సమయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'వంటగ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి ఓటేయం. దయచేసి ఇబ్బంది పెట్టకండి' అంటూ గ్రామాల్లో తమ ఇండ్లకు ఓటర్లు బోర్డులు పెట్టుకుంటుకున్నారు. తాజాగా అలాంటి బోర్డు ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. దీంతో బీజేపీ నేతలకు సామాన్య ఓటర్లు చుక్కలు కనబడుతున్నాయి. అక్కడ ప్రజాపునాది లేని బీజేపీ ధన బలాన్ని ప్రయోగించి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రతి దానికి బేరం పెట్టి ఎన్నికలను, రాజకీయాలను సరుకుగా మార్చుతున్నది. డబ్బులు, మందు, మాంసమంటూ ఆ పార్టీ నేతలు గల్లీ గల్లీలో తిరుగుతున్నారు. దాని ప్రభావాలకు లొంగిపోయిన వారికి దండేసి, దండం పెడుతున్నారు. బీజేపీ నేతల అత్యుత్సావానికి ప్రజలు విసిగివేసారి పోతున్నారు. వారి చిల్లర వేషాలకు బయపడి ఇండ్ల ముందు బోర్డులు పెట్టుకుంటున్నారు. ఓ సామాన్య ఓటర్ తన ఇంటి గుమ్మానికి అట్టముక్కపై రాసి ఇలాంటి బోర్డునే తగిలించారు. ఇది సోషల్ మీడియాలో వాయువేగంతో దూసుకుపోతున్నది. 'ఏదంయ్యా గ్యాస్ ధర పెంచితిరి..పెట్రోలు ధర పెంచితిరి...ఆఖరుకు కూరగాయలు, వంటనూనెల ధరలు పెంచితిరి. పేదోళ్లు ఎట్లా బతకాలే...ఏం తినాలే...మేమూ బతకొద్దా' అంటూ చిట్టెంపాడు గ్రామానికి చెందిన నర్సమ్మ ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతలను ఓటర్లు గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కోట్లు కోట్లు ఇచ్చారట కదా? అవే మాకు పంచుతున్నారంట కదా? అని కమలనాథులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల బీజేపీకి ఓటేయం అంటూ ఆటోలకు సైతం ప్లెక్సీలు పెట్టుకుని తిరుగుతున్నారు. దీంతో ఆపార్టీ నేతల నోట్లో ఎలక్కాయ పడినట్లైయింది. దీన్ని నుంచి తప్పించుకునేందుకు వారు కొత్త కొత్త జిమ్మికులకు పాల్పడుతున్నారు. ఆ నియోజకవర్గంలోని 85 యూట్యూబ్ ఛానళ్లను రాజగోపాల్‌రెడ్డి కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఒక్కొక్క చానల్‌కు లక్షల రూపాయలు ఇచ్చిన ఆయన తనకు అనుకూలంగా ప్రచారం చేయాలంటూ నిబంధన పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.