Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
- హోంమంత్రి మహమూద్ అలీ
- పోలీస్ అతిథిగృహం, పోలీస్ స్టేషన్ భవనాల ప్రారంభం
నవతెలంగాణ-గోదావరిఖని
శాంతి, భద్రతలు కాపాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ అత్యుత్తమంగా, ఆదర్శంగా నిలిచారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. గోదావరిఖనిలో రూ.3కోట్లతో నిర్మించిన పోలీస్ సంక్షేమ అతిథి గృహాన్ని, రూ.3.50కోట్లతో నిర్మించిన గోదావరి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో అధిక పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా విశ్వసించారని చెప్పారు. రూ.700 కోట్లు ఖర్చు చేసి పోలీసులకు ఆధునిక పెట్రోలింగ్ వాహనాలు అందించారని, డయల్100 వ్యవస్థను పటిష్టం చేశారని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలో విశ్వాసాన్ని పెంపొందించామని, నూతన పోలీస్ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించి, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌లు అద్భుతమైన విజయాలు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాయని, అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్నారని తెలిపారు. రామగుండం ప్రాంతంలో మహిళా పోలీస్ స్టేషన్‌ను ఎమ్మెల్యే కోరిన విధంగా త్వరలో మంజూరు చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయి నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా మేరకు తగ్గిందన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, స్టేషన్‌కు వచ్చే ప్రజలతో గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని సూచించారు. న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మెన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. పోలీస్ అతిథి గృహం నిర్మించడానికి సహకరించిన ఎన్టీపీసీ సంస్థకు, గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మించడానికి సహకరించిన సింగరేణి సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అంతర్గాం మండల కేంద్రంలో రూ.1.5 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, కుమార్ దీపక్, డీసీపీ రూపేష్, మేయర్ అనిల్‌కుమార్, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.