Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్వాల్‌గూడలో 300 కోట్లతో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణ బాధ్యత తీసుకుంటాం
- జీఓ 111 ఎత్తివేతతో శరవేగంగా అభివృద్ధి
నవతెలంగాణ-శంషాబాద్
హైదరాబాద్‌కే తలమానికంగా శంషాబాద్ పరిధిలోని కొత్వాల్‌గూడలో రూ.300 కోట్లతో ఏకో పార్కు (జీవావరణ) నిర్మిస్తున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా సీవరేజీ మూసీలో అనుసంధానం చేస్తామన్నారు మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడలో హైదరా బాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఏకో పార్కు పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరిరక్షణ కోసం నాడు జీఓ 111 అమల్లోకి తెచ్చారన్నారు. దాన్ని ఎత్తివేయాలని గతంలో అన్ని పార్టీలు ప్రయత్నం చేశాయని, ఈ ప్రాంత ప్రజల డిమాండ్ కూడా పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ 2014, 2019 ఎన్నికల ప్రచారంలో జీవో ఎత్తివేసి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారని తెలిపారు. అందులో భాగంగానే జీఓను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిందని గుర్తు చేశారు. జలాశయాలు ఎలాంటి కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా భవిష్యత్తు తరాలు నష్టపోకుండా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గండిపేటలో రూ.35 కోట్లతో తీర్చిదిద్దిన పార్కును ప్రారంభిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం ఆహ్లాదానికి అనుకూలంగా ప్రశాంత వాతావరణంలో వేలాది మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇందులో భాగంగానే 100 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్‌కే తలమానికమైన ఏకో పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రెండువైపులా అభివృద్ధి చేస్తామన్నారు. ఎకో పార్కుకు ప్రజలు సులువుగా చేరుకోవడానికి 100 ఫీట్ల రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. దేశంలోని అతి పెద్దదైన ఎక్వేరియం నిర్మాణం ప్రపంచంలోనే వివిధ పక్షజాతుల ఆవాస కేంద్రంగా ఎవియేరి, సాగర్ చుట్టూ బోర్డ్ వాక్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నగర ప్రజలంతా కుటుంబ సమేతంగా వచ్చి ఎంజారు చేసే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. శంషాబాద్ ఆర్జీ ఎయిర్‌పోర్టు నుంచి నార్సింగి వరకు శరవేగమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కె. సుష్మ మహేందర్ రెడ్డి , వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్, వైస్ ఎంపీపీ నీలం మోహన్, ఆర్డీవో చంద్రకళ, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.