Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- : మంత్రి హరీశ్ రావు
- డయాలసిస్ రోగులకు ఆసరా కార్డుల అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పింఛన్లకు సంబంధించి మహారాష్ట్రలో రూ.1,000, కర్ణాటకలో రూ.600 మాత్రమే ఇస్తుంటే మన రాష్ట్రంలో రూ.2,016 ఇస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను ఆయన ఆందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే 45 లక్షల మందికి సాధారణ పింఛన్లు, డయాలసిస్, ఎయిడ్స్, ఫైలేరియా రోగులకు పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.రాష్ట్రంలో ఐదు వేల మంది డయాలసిస్ రోగులకు పింఛన్లతో పాటు 10 వేల మంది రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత డయాలసిస్ సేవలందిస్తున్నామని తెలిపారు. ఆయా రోగుల కోసం సింగిల్ యూజ్ ఫిల్టర్ తెచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు వెల్లడించారు. డయాలసిస్ సెంటర్ల సంఖ్యను మూడు నుంచి 103కు పెంచుకున్నామనీ, రాష్ట్రావిర్భావం తర్వాత కిడ్నీ రోగుల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. మూత్రపిండాల మార్పిడి కోసం రూ.10 లక్షలు మంజూరు చేసి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 20 మందికి బీపీ, షుగర్ వ్యాధులొస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అనవసర మందుల వాడకం వల్ల కిడ్నీ వ్యాధులొస్తున్నాయనీ, అందువల్ల వైద్యుల సూచన మేరకే వాటిని వాడాలని సూచించారు. ప్రతి రోజూ కనీసం ఐదు లీటర్ల నీరు తాగితే రోగాలకు దూరంగా ఉండొచ్చన్నారు.
ధన్యవాదాలు...
డయాలసిస్ రోగులకు పెన్షన్ కార్డులు అందించినందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి తెలంగాణ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సీ.హెచ్.మోహన్ తో పాటు పలువురు నాయకులు మంత్రిని కలిసి శాలువతో సన్మానించారు.
జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు
జెరియాట్రిక్ కేర్ సెంటర్లు :మంత్రి హరీశ్ రావు
జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో జెరియాట్రిక్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన బోధనాస్పత్రుల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే 15 రోజుల్లో బోధనాస్పత్రులకు ఎయిర్ శాంపిలర్లను పంపించనున్నట్టు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో దాదాపు రూ.ఒక కోటి వరకు నిధులను అందుబాటులో ఉంచామనీ, వివిధ అవసరాలు తీర్చేందుకు ఉపయోగించాలని ఆదేశించారు. రోగుల డిశ్చార్జి విషయంలో జాప్యం జరగకుండా చూసేందుకు వీలుగా ప్రత్యేక పద్ధతిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇటీవల టీచింగ్ ఆస్పత్రులకు పంపించిన 800 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లలో ఎవరైనా జాయిన్ కాకుండా ఉంటే ....ఆ సమాచారాన్ని తెలపాలని కోరారు. త్వరలోనే రెండు వేల మంది పీజీ విద్యార్థులను ఆయా ఆస్పత్రులకు పంపించనున్నట్టు తెలిపారు. వెల్నెస్ సెంటర్ల సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్యశ్రీ సీఈవోతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.