Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులు ఆపేస్తున్న ఛోటా కాంట్రాక్టర్లు
- రూ. 10 వేల కోట్ల పైమాటే
- వర్కింగ్ ఏజెన్సీల లబో..దిబో
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదాయం వస్తున్నా, అవసరాలు అధికంగా ఉన్న తరుణంలో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ ఉద్యోగుల,జీతభత్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరమే. కాగా సర్కారీ ఇంజినీరింగ్ శాఖల్లో పెండింగ్ బిల్లులు పెరుకుపోతున్నాయి. సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖ, రోడ్లు, భవనాలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో నెలల తరబడి బకాయిలు ఉంటున్నాయి. దీంతో ఆయా శాఖల్లో అభివృద్ధి పనులు ఎక్కడిక్కడే ఆగిపోతున్న దుస్థితి నెలకొంది. బిల్లుల కోసం ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్న వర్కింగ్ ఏజెన్సీలు, చిన్న చిన్నా కాంట్రాక్టర్లు నిరాశకు గురవుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యతకు అనుగుణంగా నిధులను విడుదల చేస్తూ పోతుండగా, ఆయా శాఖల అవసరాలు తీరడం లేదు. నిధులకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు(బీఆర్వో)లు ఇచ్చి ఫ్రీజింగ్ సైతం పెడుతుండటంతో వర్కింగ్ ఏజెన్సీలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి కాంట్రాక్టర్లు లబోదిబో అంటున్నారు. సాగునీటి శాఖ, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోయిన విషయం తెలిసిందే.
భారీగా బకాయిలు
రాష్ట్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల్లో పెండింగ్ బిల్లులు అధికంగానే ఉన్నాయి. వర్కింగ్ ఏజెన్సీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారుల అపాయింట్మెంట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. రోడ్లు, భవనాల శాఖలో రూ. 1000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్టు తెలిసింది. మిషన్ భగీరథలో రూ. 1000 కోట్లు, సాగునీటిశాఖలో అత్యధికంగా రూ. 8000 కోట్లకుపైగానే బకాయిలు చాలా కాలం నుంచి ఉంటున్నాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో రూ. 700 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. మొత్తం ఈ నాలుగు ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించి దాదాపు రూ. 10,700 కోట్లకుపైగానే పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయని సమాచారం.
తప్పించుకుంటున్న అధికారులు
బిల్లుల కోసం వర్కింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఆయా కార్యాలయాల ముందు తచ్చాడుతున్నారు. దీంతో ఉన్నతాధికారులకే పాలుపోవడం లేదు. ఫీల్డ్‌కు వెళ్లి వచ్చేలోగా కార్యాలయాల్లో కాంట్రాక్టర్లు తారసపడుతుండటంతో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఎదురవుతున్నదని పేరు రాయడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తామని చెప్పడం తప్పితే, తాము ఏంచేయగలమని అంటున్నారు. ఒక్కోసారి కాంట్రాక్టర్లను కలవకుండానే ఆఫీసుల నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు చిన్నబుచ్చుకుంటున్నారు. పదే పదే అధికారులను కలుస్తున్నా బిల్లులు రావడం లేదనీ, ఒక్కోసారి అధికారులు కలవడం లేదనీ, ప్రభుత్వం మంజూరు చేస్తే ఇస్తామని అంటున్నారని నల్లగొండకు చెందిన ఒక చిన్న కాంట్రాక్టరు 'నవతెలంగాణ'కు చెప్పారు.
సహకరించని కేంద్రం
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా అందడం లేదని చెబుతున్న ఉన్నతాధిరులు సైతం ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ కారణాలతో ఇబ్బంధులు ఎదురవుతున్నాయని బాహాటంగానే అంటున్నారు. రాష్ట్ర పథకాలను మెచ్చుకుంటున్న కేంద్రం, నిధులు ఇవ్వడానికి మాత్రం వెనుకాడుతున్నదని చెబుతున్నారు. గతంలో 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, కాళేశ్వరం, మిషన్ భగీరథకు సంబంధించి కనీసం రూ. 50 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కారు మోకాలడ్డుతున్నది. పదే పదే ఢిల్లీ వెళ్లి అడిగినా, లేఖలు రాసినా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే.