Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పటిష్టంగా ప్రిలిమ్స్ నిర్వహించాలి : కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు అవగాహన కల్పించాలనీ, విలేకర్ల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి, డీజీపీ పి మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3,80,202 మంది అభ్యర్థులు హాజరవుతారని వివరించారు. పరీక్ష సజావుగా, పటిష్టంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌లను గుర్తించి, పోలీసు శాఖ సమన్వయంతో తగిన పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్లు సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలనీ, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేయాలని కోరారు. స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జీలు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు టీఎస్పీఎస్సీ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం సూచనలను పాటించాలని కోరారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రాలలో ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగాల్సిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) కోసం అభ్యర్థులు వారి హాల్ టిక్కెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.