Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు పీజీ సోషల్ వర్క్ విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమంటూ తమిళనాడు విద్యార్థులు కొనియాడారు. మహిళా రంగాన్ని భవిష్యత్ లో ముందంజలో నిలిపేందుకు అవి దోహద పడతాయని వారు అభినందించారు. తమిళనాడు పీజీ సోషల్ వర్క్ విభాగంలో చదువుతున్న విద్యార్థులు తమ అభ్యాసనంలో భాగంగా హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తే మహిళలకు మంచి భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి మహిళల సంక్షేమం కోసం కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ప్రభుత్వం ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక చేయూతనిస్తోందనీ, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్ల ద్వారా మాతా శిశువులకు ఆరోగ్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నదని తెలిపారు. మహిళలు అన్నింటిలో ఎదగాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయం అందిస్తున్నదని వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి ' బుధవారం నడక' పేరుతో ప్రతి వారం గ్రామాల్లో లింగ వివక్ష , బాల్య వివాహాల నిరోధంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం తమిళనాడు కాలేజీ ప్రొఫెసర్ డాన్మిక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు అధ్బుతమంటూ ప్రశంసించారు. మహిళలకు చేరువగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533 అందుబాటులోకి తీసుకురావడాన్ని అభినందించారు.