Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాచార హక్కు చట్టంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హై కోర్టు మాజీ న్యాయమూర్తి గురుగుబెల్లి యతిరాజులు అన్నారు. సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యతిరాజులు మాట్లాడుతూ రాజ్యాంగంలోని 21 ఆర్టికల్‌లో జీవించే హక్కు, కేసులు సత్వరం పరిష్కారం చేయించుకునే హక్కు తదితర వాటిని వివరించిందని తెలిపారు. ఎవరూ ఆకలి చావులకు గురి కాకూడదని తెలిపిందని గుర్తుచేశారు. ఈ చట్టంతో లక్షలాది మందికి మేలు జరిగిందని తెలిపారు. ప్రజల్లో చాలా మందికి హక్కులు తెలియదు, ధరఖాస్తులో ఎలా రాయాలి తెలియదు. అందుకోసం నమూనా ఫారం చేసి నెట్లో పెడితే బాగుంటుందని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహ చట్టం మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ చట్టం వచ్చాక 50 శాతం అవినీతి తగ్గిందని తెలిపారు. భూమిక నిర్వహకురాలు సత్యవతి, సామాజిక కార్యకర్త సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.