Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులను కోరిన సెర్ప్ సీఈఓ సందీప్‌కుమార్ సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వయం సహాయక సంఘాలలోని ఔత్సాహిక మహిళా సభ్యులకు వ్యక్తిగత వ్యాపార అభివృద్ధికి బ్యాంకులు ఆర్థిక సహకారం అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోరారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ''సెర్ప్'' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా మహిళలు వారికి ఆసక్తి గల వ్యాపార రంగంలో రాణించేందుకు బ్యాంకులు సామాజిక బాధ్యతగా ఆర్థిక సహకారం అందించాలని ఆయన కోరారు.
రూ.5, 10 లక్షలకు పైగా ఔత్సహితులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోందని, బ్యాంకులు విరివిగా వ్యాపార అభివృద్ధికి రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ దేబిషిష్ మిత్రా మాట్లాడుతూ, మహిళా ఔత్సాహికులకు అన్ని విధాలుగా చేయూతనిస్తామనీ, ఇందుకు ప్రత్యేక పాలసీ రూపొందించుకుని ముందుకెళ్తామని తెలిపారు.
ఏపీజీవీబీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలందరూ ఒక గ్రామంలో ఒకే రకమైన వ్యాపారాలు నిర్వహించకుండా డిమాండ్ సప్లరుని బట్టి వేరు వేరు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ వైఎన్‌రెడ్డి, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ అనురాధ, ఎస్బీఐ డీజీఎమ్ వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్ సురేఖ, అన్ని బ్యాంకుల డీజీఎమ్లు, ఏజీఎమ్లు, తదితరులు పాల్గొన్నారు.