Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లు, డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించాలి
- రాజీవ్ రహాదారిపై రాస్తారోకో
- మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా
- కమిషనర్‌కు అఖిలపక్ష నాయకుల వినతి
నవతెలంగాణ-గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో ఎన్టీపీసీ క్వార్టర్ల నుంచి వచ్చే మురుగు నీటితో ఇబ్బందులు ఏర్పడు తున్నాయని, రోడ్లు, డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం టీవీఎస్ షోరూం వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రజలతో కలిసి మున్సిపల్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లి, అక్కడ నిరసన తెలిపి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. నిర్వాసిత ప్రభావిత ప్రాంతమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ అభివృద్ధి పట్ల మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు నిర్లక్ష్యవైఖరి అవలం బిస్తున్నాయన్నారు. స్థానిక పరిశ్రమలకు భూములు త్యాగం చేసి రైతులు ఉపాధిని కోల్పోయారన్నారు.
పరిశ్రమల వల్ల ఏర్పడే దుమ్ము-ధూళి, కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ క్వార్టర్ల నుంచి వచ్చే మురుగు నీరు నాలా వద్ద రోడ్డుపైకి చేరి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఈ రోడ్డు వెంట నిత్యం వందలాది వాహనాలు మల్కాపూర్ శాలపల్లి తదితర గ్రామాలకు వెళ్తూ రద్దీగా ఉంటుందని చెప్పారు. సీఎస్ఆర్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పుకునే ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామాల కనీస మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మున్సిపల్ కార్పొరేషన్ కూడా డివిజన్ పట్ల చిన్నచూపు చూస్తోందన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు, ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించి 40అడుగుల రోడ్డుతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోంతల రాజేశ్ ఎండి రహీం ముస్తఫా, వెంగళ పద్మలత, బాపు, రవి మహేష్, సీపీఐ(ఎం) నాయకులు వై.యాకయ్య, బిక్షపతి, దండ రాఘవరెడ్డి, లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు కౌశిక్ హరి, గాండ్ల స్వరూప, బీఎస్పీ నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.