Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టుల పేరుతో ఓట్లు రాబట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు
- బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డిని ఓడించండి: సీపీఐ(ఎం) నాయకులు చెరుపల్లి, జూలకంటి
నవతెలంగాణ-హయత్‌నగర్
మునుగోడు ఉప్ప ఎన్నికలో కమ్యూనిస్టుల ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రతిపార్టీ కమ్యూనిస్టుల సేవలు గుర్తు చేస్తూ ఓట్లు రాబట్టేందుకు యత్నిస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎల్బీనగర్ పరిధిలో ఉంటున్న మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో బుధవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్లో నాయకులు పార్థసారథి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ కాంట్రాక్టుల దందా చేస్తూ డబ్బులను పారిస్తున్న రాజగోపాల్ రెడ్డిని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించనందున తాను రాజీనామా చేశానని రాజగోపాల్‌రెడ్డి చెప్తున్న మాయ మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఆయన ఏ గ్రామానికి పోయినా పార్టీ ఎందుకు మారావని ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. ప్రజాసమస్యలపై రాజగోపాల్‌రెడ్డి ఎన్నడూ పోరాడిన చరిత్ర లేదన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీలో చేరి ఆర్థిక లబ్దిపొందుతున్నారని విమర్శించారు. తాను వ్యక్తిగతంగా లాభపడేందుకు రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంట్రాక్టుల కోసం కాకుండా.. ప్రజలపట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఉంటే రాజీనామా చేసి అదే కాంగ్రెస్‌పార్టీ నుంచి పోటీ చేయాల్సి ఉండేదన్నారు. కానీ బీజేపీలో ఎందుకు చేరినట్టు అని ప్రశ్నించారు. బీజేపీకి మోకరిల్లి ప్రజలను చీల్చేదానికి కుట్ర పన్నాడని విమర్శించారు. ఇటువంటి అవకాశవాద రాజకీయాలపై ప్రజలు పోరాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ కనీసం ఆయన నియోజకవర్గంలో తిరిగిన చరిత్ర లేదన్నారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత లబ్దికే పాకులాడారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు వంటి హామీలు అమలు చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగాలను కారుచౌకగా అమ్మి, ప్రజల సొమ్మును కార్పొరేట్లకు దోచిపెడుతోందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ తన విధానాలతో ఇతర దేశాల్లో భారతదేశ పరువును మంటగలుపుతోందన్నారు. విదేశాల్లో మన విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎండి.జహంగీర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు విజరు, అగంటి వెంకటేశం, స్థానిక నాయకులు తుమ్మల సత్తిరెడ్డి, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.