Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామర్థ్యం 9 టీఎంసీలు
- నిల్వ ఉండేది 6 టీఎంసీలే..
- విద్యుత్ ఉత్పత్తి, సాగుకు తక్కువే..
- పేరుకుంటున్న పూడిక
- లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు
- సమాంతర రిజర్వాయరే పరిష్కారమంటున్న విశ్లేషకులు
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సాగు, తాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం ప్రతియేటా తగ్గిపోతోంది. 9.615 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లో పూడిక పేరుకుపోతోంది. దీంతో 6 టీఎంసీలకు మించి నీరు నిల్వ ఉండటం లేదు. ఏడాదిలో రెండు నెలలకుపైగా వరద వస్తోంది. ప్రతి రోజూ రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తే వారం రోజుల్లో రిజర్వాయర్ నిండిపోతుంది. మిగతా రోజుల్లో వచ్చే నీరు మొత్తం కిందికి పోతోంది. మరోవైపు ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తక్కువవుతుండటంతో సాగుకు, విద్యుత్ ఉత్పత్తికి ఏమాత్రం సరిపోవడం లేదు. ముఖ్యంగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9 టీఎంసీలకుగాను 6 టీఎంసీలు నిల్వ ఉంటుండగా.. అందులో 4 టీఎంసీలు వేసవిలో తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇక రెండు టీఎంసీల నీరు మాత్రమే సాగునీటికి వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్టు చివరి ఆయకట్టు వీపనగండ్ల, పెబ్బేరు మండలాల రైతుల పంటలకు నీరు అందడం లేదు.
జూరాల ద్వారా లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు సాగు కావలసి ఉండగా, 70 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. రబీలో ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కృష్ణా నదికి భారీ వరద వచ్చినా నీటిని నిల్వ చేసుకునే అవకాశాలు లేక ఉమ్మడి జిల్లాలో సాగుభూములన్నీ బీడుగా ఉం టున్నాయి. జూరాల ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచకపోతే సాగు నీటితోపాటు విద్యుత్ ఉత్పత్తిని సైతం కోల్పోవలసి వస్తుందని పలువురు నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ఎగువ నుంచి బుధవారం అత్యధికంగా మూడు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. 2009 తర్వాత ఇంత వరద రావడం ఇదే మొదటి సారంటున్నారు ప్రాజెక్టు అధికారులు.
విద్యుత్తు ఉత్పత్తి దయనీయం
ప్రాజెక్టుకు ప్రతి రోజూ లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. వరద నీటిని నిలువ చేసుకునే అవకాశం ఉంటే వేల మెగావాట్ల విద్యుత్తు తయారు చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. జూరాలలో అప్పర్, లోయర్ పవర్ హౌజ్ నుంచి 700ల మెగావాట్లకు మించి విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. 2021లో 730 మెగావాట్లు, ప్రస్తుత ఏడాది ఇప్పటివరకు 720 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేశారు. పుష్కలంగా నీరు ఉన్నా కొన్నిసార్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి నెలకొంది. లోయర్, అప్పర్ పవర్ హౌజ్ నుంచి వచ్చే నీటిని గేట్ల నుంచి వచ్చే నీరు వెనక్కి నెట్టేస్తుంది. దీంతో నీరు టర్బైన్లలోకి వెళ్లే ప్రమాదం ఉండటంతో అత్యధికంగా వరద వచ్చినప్పుడు కూడా విద్యుత్తును తయారు చేసుకోలేని పరిస్థితి. వరద తగ్గినప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తే సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ఇక్కడ పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేయడంతోపాటు చివరి ఆయకట్టుకు నీరు అందించాలంటే జూరాలకు సమాంతర రిజర్వాయర్ నిర్మించడంతోపాటు కాలువల ద్వారా నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు సాగునీరు అందించాలని మేధావులు కోరుతున్నారు.
నీళ్లున్నా విఫలం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీటి వనరులు అనేకం ఉన్నాయి. వాటిని ఉపయోగించు కోవడంలోనే పాలకులు విఫలమవుతున్నారు. కృష్ణా, తుంగభద్ర, బీమా, సన్నతి నదులు ఈ జిల్లాలో సుమారు 150 కిలోమీటర్ల ప్రవహిస్తున్నాయి. కృష్ణకు ఉపనది దుందుభి సైతం 70 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. వీటికి తోడు 6,560 చిన్న, పెద్ద చెరువులు ఉన్నాయి. ఏటా వీటి ద్వారా వేల టీఎంసీల నీరు వచ్చి చేరుతుంది. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న సాగునీటి వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా పాలకులు చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉండాలి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో పాలకులకు చిత్తశుద్ధి లేదు. జూరాల నిర్మాణంలో అనేక పొరపాట్లు జరి గాయి. అప్పట్లోనే సామర్థ్యాన్ని పెంచి డిజైన్ మార్చి ఉంటే నేడు లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు విద్యుత్ సమస్య తీరేది. ప్రాజెక్టులను నిర్మించే సమయంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఇప్పటికైనా పాలకులు జూరాలతో పాటు ఆర్డీఎస్ను పూర్తి చేసి తాగు, సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలి.
- ఎండి జబ్బార్ -సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి
బహుళార్థ సాధక ప్రాజెక్టు జూరాల నీరు లక్షల
క్యూసెక్కులు సముద్రం పాలవుతోంది. నెలల తరబడి
వరద వచ్చినా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితులు లేవు.
భారీగా వరదలు వస్తున్న సమయంలో సైతం నిల్వ
చేసుకోవడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేని
దుస్థితి. ఇందుకు కారణం ఏటేటా ప్రాజెక్టులో పేరుకు
పోతున్న పూడికే. 9 టీఎంసీల సామర్థ్యం కాగా..
ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేసుకునే
అవకాశం ఉంది. పూడిక తొలగించడంతోపాటు
సమాంతర రిజర్వాయర్ నిర్మిస్తేనే ఉమ్మడి పాలమూరు
జిల్లా ప్రజలకు సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా
చూడవచ్చంటున్నారు నిపుణులు.