Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు పక్కాగా అమలు చేయాలి :కలెక్టర్లు, ఎస్పీలకు టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షను ప్రశాంతంగా, పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, లైజన్ ఆఫీసర్లతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించి బుధవారం హైదరాబాద్లోనుంచి ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3,80,202 మంది అభ్యర్థులు హాజరవుతారని వివరించారు. రాష్ట్రంలోనే ఇది ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అని తెలిపారు. టీఎస్పీఎస్సీ విడుదల చేసే నిబంధనలను కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. పరీక్ష ప్రశాంతంగా, పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించామని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి హాల్ టిక్కెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ష్ట్ర్‌్‌జూర://షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జనార్ధన్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కలెక్టర్లు, ఎస్పీలు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులు రమావత్ ధన్సింగ్, బి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.