Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు
- తెలంగాణ గిరిజన సంఘం మద్దతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదివాసీ గిరిజన వ్యతిరేక బీజేపీని ఓడించేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ గిరిజన సంఘం తెలిపింది. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మానాయక్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నెల 16 నుంచి మునుగోడులో సంఘం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి గిరిజన ఓటర్లను కలిసి అభ్యర్థించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు కోసం సంఘం చేసిన పోరాటాల ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఆరు నుంచి 10 శాతానికి ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేశారు. ఈ పెంపు తక్షణమే ఉద్యగ నియామకాలకు వర్తింపజేయడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసిందని తెలిపారు. గిరిజనుల చిరకాల డిమాండ్ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలన్న కలను సాకారం చేసిందన్నారు. అందుకే టీఆర్ఎస్కు మద్ధతిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ పెంపు ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణే కారణమని విమర్శించారు.అటవీ, ఖనిజ సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెట్టే అటవీ సంరక్షణ నియమాల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సంస్కృతి, జీవన విధానాన్ని అవమాన పరుస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు చేస్తూ గో గుండాల పేరుతో ఆదివాసిలను హత్యలు చేయిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చట్టసభల్లో ఏనాడూ గిరిజన సమస్యలపై మాట్లాడలేదని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక మంది గిరిజనులపై దాడులు చేసి, కేసుల్లో ఇరికించి హింసించిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్దని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి ధీరావత్ రవి నాయక్, గుగులోత్ భీమా సాహెబ్, ఆంగోత్ వెంకన్న నాయక్ ,మూడ్ బాలు నాయక్, వాంకుడోత్ వీరన్న, బాల్యా నాయక్, ఆర్.పాండు నాయక్, అశోక్, రాంకుమార్, వెంకట్ రామ్ నాయక్, రాజేందర్ , జీ.హరిలతో పాటు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు.