Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే మునుగోడులో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం: చిన్న, మధ్యతరహా పత్రికలు, మ్యాగజైన్ల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని చిన్న పత్రికలు, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిందేననీ, లేదంటే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా దినపత్రిలు, మ్యాగజైన్ల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రాంతీయ దినపత్రికలు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని విమర్శించారు. అప్పుడప్పుడు కొన్ని రాయితీలు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో ఒక రకంగా పత్రికలు, చానెళ్ల పీకనొక్కే ప్రయత్నాలకు పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సమాచార శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, కేటీఆర్ హామీనిచ్చినా ప్రాంతీయ దినపత్రికల సమస్యలు పరిష్కారం కాలేదనీ, ఇంకా అధికమయ్యాయని అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేని పత్రికలు, చానెళ్లుఇబ్బందులకు గురయ్యాయని విమర్శించారు.
కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలూ అమలు కావడంలేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 20 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్తున్నదని గుర్తు చేశారు. కానీ అర్హులైన అనేకమంది జర్నలిస్టులు అక్రిడేషన్లు పొందలేకపోతున్నారని విమర్శించారు. గత మూడేండ్లుగా హెల్త్ కార్డులు పనిచేయడంలేదని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు మీడియా అకాడమీకి ఇచ్చామంటూ సీఎం కేసీఆర్ మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పదేపదే చెప్పారని అన్నారు. కానీ ఇప్పటివరకు రూ.50 కోట్లు కూడా విడుదల కాలేదన్నారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాల గురించి అనేక సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్ హామీలిచ్చారని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కదలికలేదని విమర్శించారు. ఈనెల 15వ తేదీలోపు తమ సమస్యలన్నీ పరిష్కరించకపోతే, సరైన హామీ ఇవ్వకపోతే మునుగోడు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. కొన్ని సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చినా, సమాచార శాఖ కమిషనర్ సానుకూలంగా స్పందించినా కొంతమంది అధికారులు ప్రభుత్వానికి, ప్రాంతీయ పత్రికలకు, జర్నలిస్టులకు, మీడియాకు మధ్య సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు దయానంద్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, డిప్యూటీ కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజంఖాన్ తదితరులు పాల్గొన్నారు.