Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డిపై జీవన్‌రెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అహంకారం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. డబ్బుతో రాజగోపాల్‌రెడ్డి, అధికార మదంతో సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మునుగోడు సమస్యల పరిష్కారంపై రాజగోపాల్‌రెడ్డి దృష్టి సారించలేదని ఆరోపించారు. చర్లగూడెం, శివన్నగూడెం భూనిర్వాసితుల కోసం కనీసం ధర్నా చేశావా? పరిహారం కోసం నిరాహార దీక్ష అయినా చేశావా? అని నిలదీశారు. వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
రాహుల్‌ను విమర్శించేస్థాయి కేటీఆర్‌కు లేదు
మాజీ ఎమ్మెల్యే ఏలేటి
తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని విమర్శించేస్థాయి మంత్రి కేటీఆర్‌కు లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేతలకు పదవులన్నీ సోనియా, రాహుల్ గాంధీ పెట్టిన భిక్షనని అన్నారు. ఇది దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుం దన్నారు. రాహుల్‌యాత్ర ఈ నెల 24న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోకి ప్రవేశించి, 15 రోజులపాటు 330 నుంచి 350 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
టీఆర్ఎస్ను గెలిపించాలని
మీరెలా చెబుతున్నారు
మండలి చైర్మెన్ గుత్తాకు నిరంజన్ ప్రశ్న
శాసనమండలి చైర్మెన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ను గెలిపించాలంటూ ఎలా చెబుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ ప్రశ్నించారు. తాను రాజ్యాంగబద్ధ పదవిలో విషయాన్ని ఆయన మర్చిపోయారా? అని నిలదీశారు.
టీఆర్ఎస్ తరుపున ప్రచారం చేయాలను కుంటేే, ఆ పదవికి రాజీనామా చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆ పదవిలో కూర్చొని ఒక పార్టీకి కొమ్ముకాయడం సరైందికాదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ పదవులకు విలువ లేకుండా పోయిందన్నారు.
పోడు భూముల సమస్యలపై బస్సు యాత్ర
మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్
తెలంగాణలో రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర ముగిశాక తాము పోడు భూముల సమస్యలపై బస్సు యాత్ర నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ చెప్పారు. అందుకు సంబంధించిన కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈనెల 15న సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు యాత్ర నిర్వహిస్తామని వివరించారు.