Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్నకొద్దీ... ఆ సీటును కైవసం చేసుకునేందుకు వీలుగా అధికార టీఆర్ఎస్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎమ్సీ అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి లోపాలు, తప్పులు జరక్కుండా పకడ్బందీగా పని చేసుకుంటూ పోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకూ తన సూచనలు, సలహాలను అమల్జేయాలంటూ ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుకు ఆయన కీలక బాధ్యతలను అప్పజెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికకు హరీశ్‌రావు ఇన్ఛార్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన జీహెచ్ఎమ్సీ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. ఈ రెండు సందర్భాల్లోనూ కారు పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. హరీశ్, కేటీఆర్ వాటికి బాధ్యత వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి వీరిద్దరిలో ఎవరో ఒక్కరికి బాధ్యతనివ్వటం సరికాదని సీఎం భావించారు. ఇద్దరూ కలిసే సమన్వయ బాధ్యతలు చూడాలంటూ ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల బాధ్యతలను కేటీఆర్‌కు, చండూరు మండల బాధ్యతలను హరీశ్‌రావుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆ రెండు మండలాల బాధ్యతలతోపాటు మొత్తం నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలను అనునిత్యం సమన్వయ పరచటం ద్వారా ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవాలంటూ గులాబీ బాస్ ఆదేశించారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్... ప్రతీరోజూ ఉదయం హైదరాబాద్‌లో భేటీ అవుతూ తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లోగల కేసీఆర్ పాత ఇంటిలో వారు సమావేశమయ్యారు. ప్రచారం సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమ పార్టీపై చేస్తున్న విమర్శలు, వాటిని ఏ రకంగా తిప్పికొట్టాలనే అంశంపై వారు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎక్కువగా కార్లను ఉపయోగించారని వారు గుర్తు చేసుకున్నారు. దీని వల్ల అనుకున్న సమయంలో, అనుకున్న రీతిలో ప్రజలను కలవలేక పోయారనే నిర్ణయానికి ఇరువురు నేతలూ వచ్చారు. అందువల్ల ఈసారి కార్లను సాధ్యమైనంత తక్కువగా వాడుతూ... మోటారు సైకిళ్ల ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలంటూ మునుగోడులో పర్యటిస్తున్న నాయకులకు సూచించారు. ఇదే తరహాలో ప్రతీరోజూ హైదరాబాద్ నుంచి అవసరమైన సూచనలు, సలహాలను ఇస్తుంటామని వారు క్యాడర్‌కు తెలిపారు. వాటిని విధిగా పాటించాలంటూ ఆదేశించారు.