Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్న కళాశాల సెక్రెటరీ
- ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలి:సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మల్లేపల్లిలోని అన్వర్ ఉలూమ్ కళాశాలను వక్ఫ్‌బోర్డు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోల్కోండ క్రాస్ రోడ్డులోని సీపీఐ(ఎం) నగర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లేపల్లి చౌరస్తాలోని అన్వర్ ఉలూమ్ కళాశాలను 1995లోనే ప్రభుత్వం వక్ఫ్‌గా రిజిస్టర్ చేసిందని తెలిపారు. సర్వే కమిషనర్ ఆధ్వర్యంలో సర్వే చేసి 3ఎకరాల స్థలంలో ఉన్న అన్వర్ ఉలూమ్ కళాశాల, దానికి అనుబంధంగా ఉన్న 22 దుకాణాలను 1984లో నోటిఫై చేసి గెజిట్ ప్రకటించిందని గుర్తుచేశారు. కానీ అన్వర్ ఉలూమ్ కళాశాల ఎడ్యూకేషనల్ అసోసియేషన్ సెక్రటరీగా చలామణి అవుతున్న వ్యక్తి.. కళాశాలను తన సొంత ఆస్తిగా మార్చుకుని అనేక విద్యాసంస్థలను నడిపిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ ఆస్తిని కబ్జా చేసి అనేక అక్రమాలకు పాల్పడుతూ వందల కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్న కళాశాల సెక్రటరీపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్వర్ ఉలూమ్ కళాశాల యాజమాన్యం వక్ఫ్‌బోర్డు ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. వక్ఫ్‌బోర్డుకు అకౌంట్స్ వివరాలు ఇవ్వకపోవడం, బడ్జెట్ ప్రతిపాదనలు పంపకపోవడం, ప్రతి యేటా వక్ఫ్ ఫండ్ చెల్లించకపోవడం, అనుమతిలేకుండా మేనేజింగ్ కమిటీని ఇష్టారాజ్యంగా మారుస్తూ అక్రమాలకు పాల్పడుతున్నదని వివరించారు. నిధుల దుర్వినియోగం విషయంలో కళాశాల సెక్రటరీపై గతంలోనే క్రిమినల్ కేసు నమోదైందన్నారు. వక్ఫ్‌బోర్డు ఇచ్చే నోటీసులను ఖాతర్ చేయకుండా నిరంతరం న్యాయపరమైన లిటిగేషన్ వేస్తూ కళాశాలను కబ్జా చేస్తున్నారని చెప్పారు. మల్లేపల్లిలోని రూ.200కోట్ల విలువైన మూడెకరాల వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఆక్రమించుకుని విద్యాసంస్థలను వ్యాపారంగా మార్చుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్న సెక్రటరీ అక్రమాలపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ప్ భూముల కబ్జాపై నాంపల్లి ఎమ్మెల్యే, ఎంఐఎం పార్టీనేతలు మాట్లాడటం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) ముషీరాబాద్ జోన్ నాయకులు అజీజ్ అహ్మద్‌ఖాన్, నాంపల్లి జోన్ కన్వీనర్ మల్లేష్ ఉన్నారు.