Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా రూ.2 కోట్ల 40 లక్షలు
- ఉపఎన్నిక నేపథ్యంలో చర్చనీయాంశం
నవతెలంగాణ-బంజారాహిల్స్
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతుండటం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల పోలీసులు వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లోనే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.10 కోట్ల హవాలా డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కారు (ుూ 09 8201)లో తరలిస్తున్న రూ.2 కోట్ల 40 లక్షలను గుర్తించి, ఆ డబ్బులు తరలిస్తున్న ముగ్గురిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. కొరియర్ సంస్థ ముసుగులో గుజరాత్ నుంచి ఈ డబ్బును తీసుకొచ్చారు. అయితే, వివేక్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు తెచ్చామని కారు ఉన్న వారు చెప్తుండటంతో.. ఆ వివేక్ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లోనే దాదాపు రూ.10 కోట్ల హవాలా డబ్బు పట్టుబడటం విశేషం. మంగళవారం గాంధీనగర్‌లో రూ.3.5 కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ డబ్బును సైదాబాద్‌లో ఉంటున్న బాలరాజుగౌడ్కు అప్పగించాలని కొందరు వ్యక్తులతో డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. దీని విషయంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. బాలరాజు అనే వ్యక్తికి హవాలా డబ్బు పంపి.. అతని నుంచి ఇంకెక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అక్టోబర్ 9న జూబ్లీహిల్స్‌లో రూ.2.49 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 8న చాంద్రాయణగుట్టలో రూ.79 లక్షలు సీజ్ చేశారు. అక్టోబర్ 7న వెంకటగిరిలో రూ.54 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సెప్టెంబర్ 29న కూడా రూ.1.24 కోట్లను కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఓటర్లకు పంపిణీ చేయడానికే ఈ డబ్బులు తీసుకెళ్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసుల నిఘా మరింత పెంచారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నారు.