Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపపోరు రాజకీయం
- గ్రామాల్లోనే నేతల మకాం
- పెరిగిన ఇండ్ల అద్దెలు
- ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉపఎన్నికల పోరు వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల నేతలంతా గ్రామాల్లోనే మకాం వేశారు. గడప గడపకూ తిరుగుతున్నారు.. ఒకరిపై మరొకరు మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. ''నువ్వు ప్రజలను మోసం చేశావంటే.. నువ్వే నమ్మక ద్రోహం చేశావని, ఆ రెండు పార్టీలు కలిసి ప్రజలను నమ్మించి గొంతుకోశాయని'' మరో పార్టీ నేతలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఓటర్లు కూడా అందరి మాటలను ప్రశాంతంగా ఆలకిస్తూనే ఉన్నారు. ఎవరివైపు అనేది బయటకు చెప్పకుండా మనసులోనే ఉంచుకుంటున్నారు. చివరకు ప్రజలు ఎవరికి పట్టం కడతారోననే భయం మూడు పార్టీల్లోనూ నెలకొంది.
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి నేతలు, అనుచరగణం మొత్తం నియోజకవర్గంలోనే తిష్టవేశారు. దీంతో ఇండ్ల కిరాయిలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గంలోనే ఉన్నారు. వారిలో మండలానికి ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీటీసీ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్‌చార్జీలుగా ఉండి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన నాయకత్వం పూర్తిగా ఇక్కడే ఉంది. హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ తప్ప నేతలంతా ప్రచారంలోనే తిరుగుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రతి మండలానికీ ముగ్గురు రాష్ట్ర నేతలు, మున్సిపాలిటీకి ముగ్గురు చొప్పున ఇన్చార్జీలను నియమించారు. వారంతా పల్లెల్లో తిరుగతున్నారు. టీపీసీసీ సారథి కూడా నియోజకవర్గంలో రోజూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలంతా ఇక్కడే మకాం వేశారు. కేంద్ర మంత్రులు వస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. అన్ని పార్టీలు దాదాపు ఒకసారి గ్రామాల్లో పర్యటనలు పూర్తి చేశాయి. ఇక బూత్‌స్థాయిలో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ జిల్లా స్థాయిలో శిక్షణాతరగతులూ ఇక్కడే నిర్వహించారు.
విమర్శనాస్త్రాలు..
ఉప ఎన్నికల పోరులో ప్రధాన మూడు పార్టీల మధ్య రాజకీయం వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు విసురుకుంటున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ''తెలంగాణ అభివృద్ధికి రూ.12వేల కోట్లు ఇవ్వాలని నీటి అయోగ్ సిఫార్సు చేస్తే కేంద్రం బుట్టదాఖలు చేసింది నిజం కాదా.. బీజేపీలో చేరినందుకే కోమటిరెడ్డికి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇవ్వలేదా'' అంటూ విమర్శించారు. కోమటిరెడ్డి సోదరులు పూటకో మాటా.. నిత్యం అసత్య ఆరోపణలతోనే కాలం గడుతుంటారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశవ్యాప్తంగా అమలు చేయగల సత్తా బీజేపీకి ఉందా అంటూ సవాల్ విసిరారు.
విద్యుత్ చట్టాలను తీసుకొచ్చి రైతులను వంచిస్తున్నది మోడీయే కదా.. జీఎస్టీ పేరుతో రాష్ట్రాలను అణచివేస్తున్నారనే మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. నాలుగేండ్లలో అభివృద్ధి చేయలేనోడు ఏడాదిలో ఏం చేయగలడో చెప్పాలని, ఎందుకు ఆయనకు ఓటేయాలో కూడా చెప్పాలన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిచిన వ్యక్తులు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేశారో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటూ.. నమ్ముకున్న పార్టీని నట్టేట ముంచి ప్రజలను వంచించ లేదా అని రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. తన ఓటు తాను వేసుకోలేని వ్యక్తి కోమటిరెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులను తెగనమ్మిన మాట వాస్తవమే కదా, వాటి ద్వారా తన సొంత మనుషులను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్న దాంట్లో నిజం ఉందో లేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా చేశారని విమర్శించారు. అక్రమ సంపాదనతో ఓట్లు కొనుగోలు చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమరిస్తున్నారు. తనను కొనుక్కునే శక్తి ఎవరికీ లేదని చెప్పుకొస్తున్నారు. ఇలా మునుగోడు రాజకీయం రోజు రోజుకూ రసవత్తరంగా సాగుతోంది. అయితే, మాటల తూటాలు హద్దులు దాటుతున్నాయి.. ఒక్కోసారి వారి మాటల పట్ల ప్రజలు చీదరించుకుంటున్న పరిస్థితి ఉంది.