Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి విధులకు హాజరు
- వీఆర్ఏల పట్ల సానుకూలంగా సర్కారు ొ పేస్కేలు, తదితర డిమాండ్లను పరిష్కరిస్తాం
- విధుల్లో చేరండి..కేసులెత్తేస్తాం ొ వచ్చే నెల ఏడో తేదీ తర్వాత మళ్లీ మాట్లాడుకుందాం
- వీఆర్ఏ జేఏసీతో చర్చల్లో సీఎస్ సోమేశ్‌కుమార్ ొ సమ్మె విరమిస్తున్నాం : వీఆర్ఏ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనీ, పేస్కేలు, వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్లు తదితర డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. సమ్మె విరమించాలని సీఎస్ కోరగా అందుకు వీఆర్ఏ జేఏసీ సానుకూలంగా స్పందించింది. వీఆర్ఏలంతా సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరింది. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్కేభవన్లో సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్‌కుమార్ షైనీ సమక్షంలో వీఆర్ఏ జేఏసీ, ట్రెసా, సీఐటీయూ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చర్చలు జరిపారు. అందులో ట్రెసా అధ్యక్షులు వంగా రవీందర్‌రెడ్డి, అధ్యక్షులు గౌతమ్‌కుమార్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి జె.వెంకటేశ్, వీఆర్ఏ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా, కో-చైర్మెన్ రమేశ్ బహుదూర్, కన్వీనర్ డీ.సాయన్న, కో-కన్వీనర్లు వై.వెంకటేశ్‌యాదవ్, వంగూరు రాములు, మహమ్మద్ రఫీ, ఎం.గోవింద్, కె.శిరీషారెడ్డి, వై.సునీత, మాధవ్నాయుడు, ఎల్.నర్సింహారావు, సాగర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు పేస్కేలు వర్తింపు, సర్వీస్నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మె కాలానికి వేతనం ఇప్పించడం, కేసులెత్తేయడం, సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుదినంగా ప్రకటించడం, సమ్మె కాలంలో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలివ్వడం, తదితర డిమాండ్లను వీఆర్ఏ జేఏసీ నాయకులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ...వీఆర్ఏల డిమాండ్ల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో ఉందని చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేయగానే వారి డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరారు. కేసులు ఎత్తివేస్తామని హామీనిచ్చారు. దీనికి వీఆర్ఏ జేఏసీ నేతలు కూడా సమ్మె విరమణకు ఒప్పుకున్నారు.
సమ్మె విరమిస్తున్నాం..సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
వీఆర్ఏ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా
సమ్మెను విరమిస్తున్నట్టు వీఆర్ఏ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా ప్రకటించారు. బుధవారం సీఎస్‌తో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వీఆర్ఏలంతా విధుల్లో చేరాలని కోరారు. సమ్మె కాలంలో తమకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సమ్మెకాలానికి సంబంధించిన వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వీఆర్ఏలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలను రెండుసార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె కాలంలో తమకు రాష్ట్ర వ్యాప్తంగా అండగా నిలిచిన ట్రెసా, సీఐటీయూ రాష్ట్ర కమిటీలకు, ప్రజాసంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. సమ్మె కాలంలో జీతాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వీఆర్ఏ కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి సహకరించిన తహసీల్దార్లకు, స్వచ్ఛంద సంస్థల వారికి ధన్యవాదాలు తెలిపారు.