Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.130 కోట్ల పనులు నీళ్లపాలేనా...?
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టుకు ముందు ఎస్సారెస్పీ వరప్రదాయనిగా విలసిల్లిన విషయం విదితమే. ఇప్పటికీ పలు ప్రాంతాలకు ఈ కాలువల ద్వారానే సాగునీరు వెళ్తుంది. అందులో కాకతీయ కాలువను ఎస్సారెస్పీ మొదటి, రెండవ దశలుగా పరిగణిస్తారు. కాగా 2015లో కాకతీయ కాలువలో ప్రవాహ సామర్ధ్యాన్ని 14 వేల క్యూసెక్కులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 8,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్ధ్యంతో నిర్మించిన కాకతీయ కాలువలు మరమ్మతులకు నోచుకోక కేవలం 3వేల నుంచి 3,500 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహించడంతో టెయిల్ ఎండ్‌లో ఉన్న మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి జిల్లాకు సాగునీరందని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కాకతీయ కాలువ ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడంలో భాగంగా కాలువ మరమ్మతులు పూర్తి చేసి ఆధునికీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.130 కోట్లతో పనులను పూర్తి చేసింది. కానీ, చింతగట్టు ఎస్సారెస్పీ క్యాంప్ వద్దనున్న కాకతీయ కాలువలో ఆధునికీకరణ పనులు నాసిరకంగా చేపట్టడంతో కాలువ లైనింగ్ కూలిపోయింది. ప్రస్తుతం కాలువ అడవిని తలపిస్తోంది. నామమాత్రంగా పనులు చేసి కోట్లాది రూపాయలను గుత్తేదారులు దండుకున్న పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ కాలువ 346 కి.మీ మేరకు ప్రవహిస్తుంది. 232 కి.మీ నుంచి 284 కి.మీ వరకు ఎస్సారెస్పీ మొదటి దశగా పరిగణిస్తారు. 284 కి.మీ నుంచి 346 కి.మీ వరకు ఎస్సారెస్పీ రెండో దశగా పరిగణిస్తారు. కాకతీయ కాలువను తొలుత 8,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్ధ్యంతో నిర్మించినా వాస్తవానికి 3 వేల నుంచి 3,500 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే కాకతీయ కాలువ నుంచి ప్రవహించింది. ఈ కాలువల సామర్ధ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరణ పనులను చేపట్టారు. చింతగట్టు సమీపంలో కాకతీయ కాలువ ఆధునికీకరణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ పనులను పూర్తి కూడా చేశారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఈ పనులు 6 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా, రెండేండ్లకుపైగా పనులు కొనసా గాయి. ఇదిలావుంటే పనులు మరీ నాసిరకంగా చేయడంతో కాకతీయ కాలువ లైనింగ్ పలు చోట్ల తీవ్రంగా దెబ్బతింది.
అడవిని తలపిస్తున్న కాకతీయ కాలువ
కాకతీయ కాలువ చింతగుట్టు ఎస్సారెస్పీ క్యాంపు సమీపంలో హన్మకొండ-కరీంనగర్ ప్రధాన రహదారి ఎగువన కాలువ అడవిని తలపిస్తుంది. పెద్దపెద్ద వృక్షాలతో కాలువ పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితితోపాటు కాలువలోని ప్రవాహం కనపడని పరిస్థితి నెలకొంది. పక్కనే ఉన్న క్యాంపులోని నీటిపారుదల శాఖ అధికారులు నిత్యం ఈ కాలువను చూస్తున్నా వృక్షాలను తొలగించే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇవి మరింతగా పెరిగితే కాలువ చాలా చోట్ల దెబ్బతిని సాగునీరు వృధాగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖాధికారులు దెబ్బతిన్న లైనింగ్‌కు మరమ్మతులు చేయడంతో పాటు కాలువలో అడవిని తొలగించాల్సిన అవసరముందని, నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కూతవేటు దూరంలోనే లైనింగ్ ధ్వంసం..
చింతగట్టు ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం సమీపంలోని కాకతీయ కాలువ లైనింగ్ పలు చోట్ల దెబ్బతినింది. అయినా కాంట్రాక్టర్‌కు క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎలా సర్టిఫై చేశారు, బిల్లులు ఎలా చెల్లించారనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు స్పందించకపోవడం గమనార్హం. హన్మకొండ-కరీంనగర్ ప్రధాన రహదారికి ఎగువన కాకతీయ కాలువ లైనింగ్ చాలా చోట్ల దెబ్బతినడం, ఇంజినీరింగ్ అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిచ్చింది.