Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడును దత్తత తీసుకుంటా..
- చేనేత కార్మికుల జీవితాలను నాశనం చేసిన మోడీ : మంత్రి కేటీఆర్
- రాజ్యాంగాన్ని నాశనం చేసేవాళ్ల నడ్డివిరగ్గొట్టాలే : తమ్మినేని
- బీజేపీ వాళ్లు 420లు : కూనంనేని
- చండూరు పట్టణంలో నామినేషన్ వేళ భారీ ర్యాలీ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల అండ ఉండగా.. ఇక విజయం పక్కా అని తేలిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర నేతలతో కలిసి మంత్రి ప్రసంగించారు. కామ్రేడ్లు కలిసి రావడంతో నియోజకవర్గంలో విజయంపై పూర్తి నమ్మకం పెరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో సీపీఐ(ఎం), సీపీఐ, గులాబీ జెండాలు కలిసి ఐక్యంగా పనిచేస్తున్నాయన్నారు. ఎర్రజెండా, గులాబీ జెండా కలిసిన తర్వాత మన విజయం స్పష్టమైందన్నారు. మునుగోడులో ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే తాను ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నిక బలవంతంగా మనపై రుద్దబడిన ఎన్నిక అన్నారు. ఏనాడూ ప్రజల కోసం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడింది లేదని, ఎప్పుడు మాట్లాడినా కాంట్రాక్టర్ల కోసమే చెప్పేవారని విమర్శించారు. ఆ తర్వాత బిల్లులు ఇప్పించాలని 'మమ్మల్ని' బతిమిలాడేవారని తెలిపారు. రూ.18వేల కోట్ల కాంట్ట్రాక్టుతో రాజ్‌గోపాల్‌రెడ్డిని బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. డబ్బు మదం ఉన్న కాంట్రాక్టర్‌కు, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమిదని చెప్పారు.
అంగడి సరుకులా ఓట్లను కొనుగోలు చేయడానికి బీజేపీ దొంగలు వచ్చారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తమ కోసం పనిచేసిన టీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలోనే చర్లగూడెం ప్రాజెక్టు, శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా 2.50లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో యాదవులకు గొర్రెల యూనిట్లు 5765 పంపిణీ చేసినట్టు తెలిపారు. చేనేతపై జీఎస్టీ వేసి కార్మికుల జీవితాలను నాశనం చేసిన దుర్మార్గుడు మోడీ అని విమర్శించారు. చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించిన టీఆర్ఎస్ వైపు ఉండాలని కోరారు. నిరుద్యోగులకు 2కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన మోడీ వాటిని మరిచారని చెప్పారు.
బీజేపీ 420గాళ్లు వస్తున్నారు జాగ్రత్త్త..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
బీజేపీ పేరుతో 420గాళ్లు నియోజకవర్గానికి వస్తున్నారని, ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబిశివరావు అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ పంపించారని, అతనిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రామాల్లో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. త్యాగధనుల రక్తంతో ఎరుపెక్కిన నల్లగొండలో బీజేపీకి చోటు లేదని, ఆ పార్టీని బొందపెట్టాలని ప్రజలను కోరారు. వామపక్షాలకు పట్టున్న ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడూ కమ్యూనిస్టులు అండగా ఉన్నారని, తప్పకుండా ధర్మం గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు.
బీజేపీని నడిపించేది ఆర్ఎస్ఎస్: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
రాజ్యాంగాన్ని నాశనం చేసే వాళ్ల నడ్డివిరగ్గొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీని నడిపించేది ఆర్ఎస్ఎస్ సంస్థ అని చెప్పారు. ఆ సంస్థ చాలా ప్రమాదకరమైందన్నారు. గతంలో అంబేద్కర్ రచించిన రాజ్యంగం చెత్త అని వ్యాఖ్యనించారని, ఇప్పుడు దానిని సమూలంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, చంపుకునేలా చేస్తున్న ఆ పార్టీకా మనం ఓట్లేసేది అని ప్రశ్నించారు. మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా అమ్మేస్తున్నారని తెలిపారు. ఎల్ఐసీ, రైళ్లు, బస్సులు, పడవలు, విమానాలు, బొగ్గులను, స్టీలు ఫ్యాక్టరీని కారుచౌకగా విక్రయిస్తున్నారని వివరించారు. రాష్ట్రాల హక్కులను నిరాకరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పోయే కాలం వచ్చిందన్నారు.
నూతన విద్యుత్ చట్టం అమల్లోకొస్తే ఉచిత విద్యుత్ ఉండదని చెప్పారు. మోటార్లకు మీటర్లు బిగించాలని, ఉచిత విద్యుత్ రద్దు చేయాలని చట్టం తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక, నూతన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీఆర్ఎస్, వామపక్షాలకు ఓటు వేయాల్సిన బాధ్యత ఉందన్నారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల పన్నుల హక్కును కేంద్ర తన పరిధిలోకి తీసుకని రాష్ట్రాలను బిచ్చగాళ్లను చేసిందన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా మార్కెట్లను రద్దు చేసిన మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులుగా తాము టీిఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు మద్దతుగా ఉంటున్నామని చెప్పారు. టీఆర్ఎస్ 50వేల మోజార్టీతో గెలుస్తుందన్న నమ్మకం వచ్చిందన్నారు.
భారీ ర్యాలీ
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా టీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు, కార్యకర్తలు చండూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 5కిలోమీటర్ల పరిధిలో జనం ర్యాలీ సాగింది. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కార్యకర్తలు డప్పులు, వాయిద్యాలతో ముందుకుసాగారు. ర్యాలీలో సుమారు 10వేల మందికి పైగా పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టీిఆర్‌ఎస్ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎండి. జహంగీర్, నెల్లికంటి సత్యం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్రకుమార్, మూడు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు
మునుగోడు శాసనసభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తరపున రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి చండూరు మండల కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి మొదటి సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రెండో సెట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో మంత్రి కేటీఆర్
మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలిశారు. ప్రచార ర్యాలీ అనంతరం ఆయన స్వామి ఇంటికెళ్లారు. స్వామి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. స్వామితో కలిసి వారింట్లోనే భోజనం చేశారు. స్వామి నడిపిస్తున్న హెయిర్ సెలూన్ గురించి తెలుసుకున్నారు. అంశాల స్వామిని చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ, ఇంటింటికీ కృష్ణా జలాలతో తాగునీరు వంటి భారీ ప్రాజెక్టు ప్రారంభించారని మంత్రి గుర్తు చేశారు. మూడు సంవత్సరాల నుంచి ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కావట్లేదని, ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మెన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గతంలో మంత్రి ఆదేశాల మేరకు స్వామికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజురైంది.
నేను పక్కా లోకల్..
'నేను పక్కా లోకల్.. ఆయన నాన్‌లోకల్.. ఇంటి వాడు.. ఇంటివాడే.. బయటివాడు.. బయటివాడే.. అందుకే నన్ను గెలిపించండి.. మీతో కలిసి ఉంటాను' అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఆశీర్వదించి ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. 2018 నుంచి మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధిని తిరిగి కొనసాగిస్తానన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప మళ్లీ ఏ పనీ జరగలేదని చెప్పారు.
- టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి