Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుబ్బాక, హుజూరాబాద్‌లో అమలుకు నోచని బీజేపీ వాగ్దానాలు
- మునుగోడులో 'కోమటిరెడ్డి'కి హామీల కష్టాలు
- 'కేంద్రంతో మాట్లాడి' అంటూ అవే ఊకదంపుడు ఉపన్యాసాలు
- ఆ..ఆడ చేశారు.. ఇగ ఈడ చేస్తారు.. అంటూ నవ్వుకుంటున్న జనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చెప్పే వాడికి వినేవాడు లోకువంటారు పెద్దలు. ఈ నానుడిని వర్తమాన రాజకీయ పరిస్థితులకు అన్వయించుకుంటే... డబుల్ ఇంజిన్ అంటూ ఊదరగొడుతున్న బీజేపీకి ఓటర్లంటే లోకువ అని చదువుకోవాల్సి వస్తుంది. రెండు కోట్ల ఉద్యోగాలు.. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామంటూ 2014లో హామీనిచ్చిన ప్రధాని మోడీ... ఇప్పుడు వాటి గురించి ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తుంటారు. అదే కోవలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఓటర్లకు హామీల మీద హామీలు గుప్పించిన కమలం పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలు... ఇప్పుడు వాటి ఊసే ఎత్తటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చినా ఇవ్వకపోయినా కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని ఒప్పిచి, మెప్పించి ఆయా హామీలను నెరవేరుస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజరుతోపాటు ఆ పార్టీ సీనియర్లు కిషన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, అప్పటి అభ్యర్థులు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ప్రజలకు వాగ్దానం చేశారు. ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా వాటికి అతీగతీ లేదు. పైగా ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కూడా డబుల్ ఇంజిన్ నేతలు... 'రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రంతో మాట్లాడి...' అనే ఊకదంపుడు స్టేట్మెంట్లు ఇవ్వటం గమనార్హం. అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటూ చెప్పుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం అదే రకమైన ప్రకటనలు గుప్పిస్తుండటంతో జనాలు విస్తుబోతున్నారు. గతంలో ఈ మాటలు నమ్మి ఓటేసిన ప్రజలకు బీజేపీ రిక్తహస్తాన్నే మిగిల్చిందని పలువురు వాపోతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ప్రతీ రైతు కుటుంబానికి ఒక నాగలి, రెండు ఎద్దులను ఇస్తామంటూ రఘునందన్‌రావు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ.మూడు వేల భృతి, ప్రధానిని ఒప్పించటం ద్వారా ప్రతి పంటకు అవసరమైన ఎరువులను ఉచితంగా పంపిణీ, దుబ్బాక పట్టణానికి కేంద్ర నిధుల ద్వారా ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటు, పేద కుటుంబాల్లోని అమ్మాయిల వివాహానికి మంగళసూత్రం, మెట్టెలు, ఒక జత దుస్తులు ఇస్తామనే తదితర 16 హామీలను ఆయనిచ్చారు. ఈ అంశాలన్నింటినీ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప ఒక్కటీ అమలు కాలేదు. మరోవైపు ఉచిత ఎరువుల పంపిణీ సంగతి పక్కనబెడితే... కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా పెంచిన ఎరువుల ధరలతో దుబ్బాకే కాదు రాష్ట్రంలోని అన్నదాతలందరి నడ్డీ విరిగింది.
ఇక హుజూరాబాద్ విషయానికొస్తే... నియోజకవర్గంలో 60 ఏండ్లు దాటిన చిన్న సన్నకారు రైతులందరికీ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన కింద నెలకు రూ.మూడు వేల పింఛన్ ఇస్తామన్న హామీ ఇంకా అక్కడికి చేరనేలేదు. నియోజకవర్గ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అండర్ బ్రిడ్జీల నిర్మాణం, రైల్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం అటకెక్కాయి. కేంద్ర పథకమైన విద్యాలక్ష్మి కింద విదేశాల్లో చదవే విద్యార్థినిలను ఆదుకుంటామంటూ బీజేపీ అప్పట్లో ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఆ నియోజకవర్గంలో ఇప్పటి దాకా ఒక్కరంటే ఒక్కరు కూడా లబ్ది పొందలేదన్నది గణాంకాలు చెప్పే వాస్తవం. కేంద్ర నిధులతో జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాలను అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకూ ఒక్క రూపాయీ రాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో హుజూరాబాద్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్న హామీ... కేవలం హామీగానే మిగిలిపోయింది. కేంద్ర కృషి సంచారు యోజన కింద కాల్వల మరమ్మతులు చేపడతామన్న వాగ్దానం కూడా అమలుకు నోచుకోలేదు. ఇదే తరహాలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ) ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ లెక్కకు మిక్కిలి మాటలు చెప్పింది. అప్పట్లో వరదలు సంభవించిన దృష్ట్యా... కార్లు కొట్టుకుపోతే కార్లు, బైకులు కొట్టుకుపోతే బైకులిస్తామంటూ హామీలు గుప్పించింది. ఇండ్లు కూలిపోతే నూతనంగా గృహాలను నిర్మిస్తామంటూ వరాలు కురిపించింది. ఫలితంగా జీహెచ్ఎమ్సీలో ఆ పార్టీ 40కి పైగా సీట్లను గెలుచుకుంది. అయితే ఆయా హామీల గురించి కమలం పార్టీ నేతలు నోరు మెదపకపోవటం గమనార్హం. ఈ క్రమంలో ఇప్పుడు మునుగోడులో సైతం ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ నాయకులు 'రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా...' అంటూ వాగ్దానాల వర్షం కురిపిస్తుండటంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.