Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఏ-1కు వర్తింపచేసిన సర్కారు
- నవంబర్ 1 నుంచి పరీక్షలు
- ఉత్తర్వులు విడుదల
- వార్షిక పరీక్షలూ అదే తరహాలో నిర్వహణ
- వందశాతం సిలబస్‌తో ప్రశ్నాపత్రం తయారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలు ఆరు పేపర్లతోనే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎస్ఏ-1 పరీక్షలు ప్రారంభమవుతాయని వివరించారు. వచ్చేనెల ఏడో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే సిలబస్‌ను మాత్రం ప్రభుత్వం కుదించకపోవడం గమనార్హం. వందశాతం సిలబస్‌తోనే ప్రశ్నాపత్రాలను అధికారులు తయారు చేయనున్నారు. ఎస్ఏ-1 పరీక్షల తరహాలోనే పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు సైతం ఆరు పేపర్లతోనే అధికారులు నిర్వహించే అవకాశమున్నది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2021లో పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఏడాది కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. గత విద్యాసంవత్సరం (2022)లో పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ పరీక్షలను నిర్వహించింది. ఆరు పేపర్లతోనే నిర్వహించడం తెలిసిందే. ఇప్పుడు 2023లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలనూ ఆరు పేపర్లతో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం (బయలాజికల్ సైన్స్), సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా నిర్వహించేవారు. ఇక హిందీ సబ్జెక్ట్‌కు ఒకే పరీక్ష జరిగేది. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకే ప్రభుత్వం కుదించి నిర్వహిస్తున్నది.
11 పేపర్లతోనే 'పది' పరీక్షలు : కొందరు డీఈవోలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ప్రస్తుత విద్యాసంవత్సరంలో 11 పేపర్లతో నిర్వహిస్తున్నట్టు కొన్ని జిల్లాల డీఈవోలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు సైతం జారీ చేశారు. ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ 11 కాదు ఆరు పేపర్లతోనే పదో తరగతి పరీక్షలుంటాయని ప్రకటించడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ నిర్ణయం విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే పదో తరగతి పరీక్షలపై స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తే బాగుండేదని కొందరు అధికారులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. బడులు ప్రారంభమైన ఐదు నెలల తర్వాత నిర్ణయం తీసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కొంత గందరగోళం నెలకొంటుందని విమర్శిస్తున్నారు.
తక్కువ సమయంలో ప్రశ్నాపత్రాల తయారీ సాధ్యమేనా?
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను రూపొందించి ముద్రించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు ఆ ప్రశ్నాపత్రాలనే వాడుకునేందుకు అవకాశమున్నది. కానీ తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు 11 పేపర్ల చొప్పున ప్రశ్నాపత్రాలను తయారు చేసి ముద్రించారు. ఇప్పుడు అవి వినియోగించడానికి అవకాశం లేదు. అయితే కొత్తగా ప్రశ్నాపత్రాలను తయారు చేసి, అధికారుల ఆమోదం పొంది ముద్రణ కోసం వెళ్లాలి. ఉపాధ్యాయులను సన్నద్ధం చేసి, ప్రశ్నలను తయారు చేసేందుకే సమయం పడుతుంది.
వాటిని ముద్రించడానికి మరింత సమయం కావాలి. ఇప్పుడు కేవలం 19 రోజులే సమయమున్నది. అందులోనూ నాలుగు రోజులు సెలవులుంటాయి. ఇంకోవైపు కరోనా తర్వాత నిర్వహిస్తున్న ఎస్ఏ-1 ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ సాధ్యమేనా?అన్న అనుమానాలు ఉపాధ్యాయులు, అధికారుల్లో వ్యక్తమవుతున్నది. అవి ముద్రించిన తర్వాత జిల్లాలు, మండలాలు, పాఠశాలల వరకు చేరాలి. ఇంకోవైపు ప్రశ్నాపత్రాల ముద్రణ ప్రక్రియ గోప్యంగా ఉంటుంది. అలాంటి ప్రింటింగ్ ప్రెస్‌లు రాష్ట్రంలో తక్కువగానే ఉన్నట్టు సమాచారం. దీంతో షెడ్యూల్ ప్రకారం ఎస్ఏ-1 పరీక్షలు జరుగుతాయా?అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.