Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీకి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను ఏవిధంగా అమలు చేస్తున్నారో పూర్తి వివరాలను శుక్రవారం జరిగే విచారణ సమయంలో అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితా సమర్పించాలని కోరింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నకిలీ ఓట్ల నమోదు జరిగిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌ను గురువారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఓటర్ల జాబితా, కొత్త దరఖాస్తులు, తిరస్కరించిన వాటి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలన్నది. జనవరి నుంచి జూలై మధ్య ఏడు నెలల కాలంలో 1,474 మంది మాత్రమే కొత్త ఓటర్ల దరఖాస్తులు వచ్చాయనీ, ఈ ఉప ఎన్నికల తరుణంలో దరఖాస్తులు 24,781లకు చేరడంపై బీజేపీ తరఫు న్యాయాది రచనారెడ్డి అభ్యంతరం చెప్పారు. వేరే ప్రాంతాల వాళ్ల ఓట్లను ఇక్కడ నమోదు చేశారని చెప్పారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ బోగస్, నకిలీ ఓట్లను చేర్పించిందని చెప్పారు. కేవలం రెండు నెలల్లో 24,781 కొత్త ఓట్లు నమోదయ్యాయనీ, వీటిని ఆమోదిస్తే ఎన్నికలపై ప్రభావం పడుతుందని తెలిపారు. జూలై 31 నాటి ఓటర్ల లిస్ట్ మేరకు మునుగోడు ఎన్నికలు నిర్వహణకు ఈసీకి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ నెల 14న ఈసీ కొత్త ఓటర్ల లిస్ట్ ప్రకటించకముందే ఆదేశాలు జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఫారం 6, 7, 8ల ద్వారా 24,781 మంది చేసుకున్న దరఖాస్తులను ఆమోదిస్తే రాజ్యాంగంలోని 14, 21 అధికరణాల స్ఫూర్తిని నీరుగారుస్తుందన్నారు. రిట్‌ను కొట్టేయాలని ఈసీ న్యాయవాది దేశారు అవినాశ్ వాదించారు. ఎన్నికల ముందు ఆ విధంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు కావడం సహజంగానే జరుగుతుందని చెప్పారు. కొత్త దరఖాస్తుల్లో ఏడు వేలను అధికారులు తిరస్కరించారని చెప్పారు. నామినేషన్ వేసే చివరి రోజు వరకు దరఖాస్తుల స్వీకరణకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈసీ యాక్ట్‌లోని సెక్షన్ 23(3) ప్రకారం చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకునే వీలుందన్నారు. విచారణ నేటికి వాయిదా పడింది.
కౌన్సిలింగ్‌కు అనుమతించండి
పీడబ్ల్యూడీ కోటా కింద నీట్-2022 కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలంటూ వైకల్య విద్యార్థి వేసిన కేసులో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఒక చేయి ఉన్న వారు ఎంబీబీఎస్‌కు అనర్హులన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నిబంధనను తప్పుపడుతూ మెహదీపట్నంకు చెందిన విద్యార్థి ఒమర్ సలీమ్ అహమద్ వేసిన రిట్‌ను గురువారం చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. పిటిషనర్‌ను మెడికల్ కౌన్సిల్‌కు అనుమతించాలని కాళోజీ వైద్య వర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
గ్రూప్ 1 పరీక్షలపై మధ్యంతర ఉత్తర్వులు
ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పునకు లోబడి వాటి ఫలితాలు ఉంటాయంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ల వినతిని పరిశీలించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022, సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 33 ప్రకారం గ్రూప్- 1 పోస్టుల భర్తీ చేసేలా ఆదేశాలు కోరుతూ మెదక్ జిల్లా సర్ధనా హవేలీఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన స్వప్న మరో నలుగురు రిట్ దాఖలు చేశారు. కొత్త రిజర్వేషన్ల జీవోకు అనుగుణంగా గ్రూప్- 1 నోటిఫికేషన్ మళ్లీ ఇవ్వాలని కోరారు. జీఏడీ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం ఆదేశించారు, 503 పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిందనీ, రోస్టర్ పాయింట్ల నిర్ణయించకుండానే గ్రూప్-1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారనీ, రోస్టర్ పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు 50 పోస్టులు ఎస్టీలకు లభిస్తాయనీ, ఇప్పుడు 30 పోస్టులే వస్తాయని చెప్పారు. దీనిపై హైకోర్టు గ్రూప్- 1 పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది అయితే తుది ఫలితాలు తమ తీర్పునకు లోబడే ఉంటాయని షరతు విధించింది.
కోవిడ్ పిల్స్ క్లోజ్
కోవిడ్ వ్యాప్తి సమయంలో దాఖలైన పిల్స్ విచారణకు హైకోర్టు తెరదించింది. కోవిడ్ తగ్గిందనీ, పిల్స్‌పై విచారణ అవసరం లేదని చెప్పింది. అయితే కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు నాలుగు నెలల్లోగా రాష్ట్రం పరిహారం చెల్లించాలనీ, కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించింది. తమ ఉత్తర్వులు అమలు కాకపోతే పిటిషనర్లు తిరిగి హైకోర్టుకు రావచ్చునని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.