Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏ జేఏసీకి మంత్రి కేటీఆర్ పిలుపు
- నేడు కలువనున్న నేతలు
- విధుల్లో చేరిన 23 వేల మంది వీఆర్ఏలు
- మెరుపు రాస్తారోకో ఘటనలో 15 మందిపై కేసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీతాలు నిలిపివేసినా 80 రోజుల అలుపెరుగని సుదీర్ఘ సమ్మె...ఇందిరాపార్కు వద్ద మహాధర్నా...చలో అసెంబ్లీ ముట్టడి...ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో మెరుపు రాస్తారోకోతో వీఆర్ఏలు తమ పోరాట రూపాన్ని ఉధృతం చేస్తున్నారని గ్రహించిన రాష్ట్ర సర్కారు సమస్యల పరిష్కారానికి కొంత సానుకూలతను ప్రకటించింది. బుధవారం రాత్రి వీఆర్ఏ జేఏసీతో చర్చలు జరిపిన విషయం విదితమే. 'నవంబర్ ఏడో తేదీ వరకు ఆగండి. ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్యను పరిష్కరిస్తాం. సీఎం మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. దయచేసి సమ్మె విరమించండి' అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విజ్ఞప్తిని మన్నించి 23 వేల మంది వీఆర్ఏలు సమ్మెను విరమించి గురువారం విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వమూ ఓ మెట్టు దిగింది. 'ప్రగతిభవన్‌కు రండి...సమస్యలపై మాట్లాడుకుందాం' అంటూ వీఆర్ఏసీ జేఏసీ నేతలను మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ నేతలు శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లనున్నారు. పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు, సొంతూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ, సర్వీసు నిబంధనలు తదితరాలపై కూలంకుషంగా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. మరోవైపు మెరుపు రాస్తారోకో ఘటనలో 15 మంది వీఆర్ఏ జేఏసీ నేతలపై పోలీసులు కేసులు బుక్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఎన్ని కష్టాలొచ్చినా, జీతాలు రాకపోయినా వీఆర్ఏలు 80 రోజుల పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. సమ్మె కాలం వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేత, తదితర డిమాండ్లపై మంత్రి కేటీఆర్ నిర్ధిష్టమైన హామీలిస్తారనే ఆశావాద దృక్పథంలో వీఆర్ఏలున్నారు. ఒకవేళ ప్రభుత్వం అడిగిన గడువు తర్వాత కూడా డిమాండ్లను పరిష్కరించకుంటే ఐక్యంగా ముందుకు సాగుతూ పోరాటాన్ని ఉధృతం చేయాలనే ఆలోచనలో వీఆర్ఏ జేఏసీ నాయకత్వం ఉంది.
15 మంది వీఆర్ఏ జేఏసీ నేతలపై కేసు నమోదు
ఇందిరాపార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమానికి పోలీసులు అడ్డంకి చెప్పడంతో హైదరాబాద్‌కు తరలివచ్చిన వీఆర్ఏలలో కొందరు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో మెరుపు రాస్తారోకోకు దిగిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా వందలాది మంది వీఆర్ఏలు రోడ్డుపై బైటాయించి జనజీవనానికి అడ్డు తగిలారనే కారణంతో 15 మంది వీఆర్ఏ జేఏసీ నేతలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. యూఎస్ 147, 341, 353, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్లపై కేసులు పెట్టారు. ఏ1గా వీఆర్ఏ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా, కో-కన్వీనర్లు వై.వెకంటేశ్యాదవ్(ఏ2), వంగూరు రాములు(ఏ3), కంది శిరిషారెడ్డి(ఏ4), వై.సునీత(ఏ5), కావలి మాధవనాయుడు(ఏ6), ఎల్.నర్సింహారావు(ఏ7), వీఆర్ఏలు జి.వెంకటేశం(ఏ8), కె.రాజు(ఏ9), కె.రామచంద్రయ్య(ఏ10), బి.సత్యనారాయణ (ఏ11), లింగరాజు యాదవ్(ఏ12), డి.శ్రీనివాసరావు(ఏ13), బి.వీరాస్వామి(ఏ14), మహేశ్(ఏ15)గా పేర్కొన్నారు.